Telangana |హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం గరంగరంగా సాగినట్టు తెలిసింది. విద్యుత్తు రంగ సంసరణల్లో భాగంగా మూడో డిసం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం, కొత్త పవర్ ప్లాంట్ ప్రతిపాదనలను మంత్రులు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వైటీపీపీ మీదనే విచారణకు ఆదేశించిన మనం మళ్లీ ఈ కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఎందుకు తీసుకొచ్చినట్టు?’ అని మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం చేసినట్టు తెలిసింది.
‘అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం అనేది ప్లాన్డ్ సిటీలకు బాగుంటది. కానీ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో అండర్ గ్రౌం డ్ కేబుల్ నిర్మాణం ఎట్ల సాధ్యమైతది? ఇప్పటికే మనుగడలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వలను ధ్వంసం చేసి కేబుల్ లైన్స్ వేయడం అంచనాలకు మించిన ఖర్చు కాదా?’ అని మంత్రు లు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇచ్చిన హామీలకే నిధుల్లేక ఇబ్బంది పడుతున్నామని, మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న రూ.2500, పింఛన్ల పెంపు పథకాలు మెడమీద ఉన్నాయని, మరో రెండు నెలలు పోతే రైతు భరోసా వస్తుందని, వీటికే డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే కొత్త బరువు నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు? అని సీఎం, డిప్యూటీ సీఎం మినహా మిగిలిన మంత్రులంతా వ్యతిరేకించినట్టు తెలిసింది.
మలి ప్రాధాన్యతా అంశంగా విద్యుత్తు రంగ సంసరణలు చర్చకు వచ్చినట్టు సమాచారం. విద్యుత్తు రంగ సంసరణలు, చేపట్టబోతున్న ప్రాజెక్టుపై విద్యుత్తు ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ దాదాపు గంటకు పైగా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో మంత్రులకు వివరించినట్టు తెలిసింది. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్పై భారం తగ్గించేందుకు ప్రభుత్వం 2026 జనవరి కల్లా మూడో డిసంను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. మెట్రో వాటర్ బోర్డు వంటి రంగాలకు విద్యుత్తు సరఫరా బాధ్యతలను ఈ కొత్త డిసం తీసుకోనున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు మాత్రం ప్రస్తుత డిసంల నుంచే అందించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనను మంత్రి వర్గం తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. ‘మూడో డిస్కం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వ్యయం కనీసం రూ.30 వేల కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా బడ్జెట్ అవసరం. అంత భారం మోయడం అసాధ్యం. మీకు రాష్ట్ర బడ్జెట్ మీద ఆలోచన ఉండే ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసిండ్రా?’ అని ఐఏఎస్ అధికారులను మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు నిలదీసినట్టు తెలిసింది. విద్యుత్తు పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) ఎంత బకాయిలు ఉన్నాయని ఓ మంత్రి ప్రశ్నించగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.28,140 కోట్లు, వివిధ తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,564 కోట్లు బకాయిలున్నాయని అధికారులు వివరించినట్టు సమాచారం. ఇన్ని బకాయిలు మెడకు పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు ఎందుకు ప్రతిపాదిస్తున్నారని సీనియర్ మంత్రి నిలదీయగా బ్యూరోక్రాట్లు నీళ్లు నమిలినట్టు తెలిసింది. ఈ సందర్భంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కల్పించుకొని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న మక్తల్‌లో పిట్‌హెడ్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన చేయగా దీనిపై స్థానిక మంత్రితో పాటు సీనియర్ మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. తన నియోజకవర్గంలో రైతుల భూములు గుంజుకొని, కొండగల్ నియోజకవర్గానికి వెలుగులు పంచే ఎత్తుగడ అని స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి ఆభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘అందుకేనా? నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంగా మార్పు చేసింది?’ అని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సీనియర్ మంత్రి కల్పించుకొని ‘పిట్‌హెడ్ ప్లాంట్ అంటే ఎక్కడ ముడి సరుకు దొరుకుతుందో అక్కడే ప్లాంటు పెట్టడం.. యాదగిరి గుట్టలో బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీపీ) పెడితే మనమే నానా యాగీ చేసి, దానిమీద విచారణ కమిషన్ వేసినం. ఇప్పుడు మనమే అటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు పెడతామనే ప్రతిపాదనలు పెడితే ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చిన వాళ్లమవుతామో మీరు ఆలోచన చేశారా?’ అని నిలదీసినట్టు తెలిసింది. ‘మూడు పవర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అంత బడ్జెట్ మనం సమకూర్చగలమా? ఒక వేళ సమకూర్చిన మిషనరీ కాంట్రాక్టు పెద్ద సమస్య, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కు మిషనరీ కాంట్రాక్టు ఇచ్చిన గత ప్రభుత్వం మీదనే మన ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఇప్పుడు మనం కూడా అదే పని చేస్తే ఎట్ల?’ అని గట్టిగానే నిలదీసినట్టు తెలిసింది.
‘అభివృద్ధి చెందిన పట్టణానికి అండర్ గ్రౌండ్ కేబుల్ వయబుల్ కాదు. వర్షాలు, గాలివానల సమయంలో విద్యుత్తు అంతరాయాలను తగ్గించేందుకు హైదరాబాద్‌ను మూడు సరిళ్లుగా విడగొట్టి పూర్తి భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయలనే ప్రతిపాదన సరైంది కాదు’ అని మంత్రులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ‘అమల్లోకి వస్తే విద్యుత్తు అంతరాయాలు తగ్గుతాయి. నిర్వహణ ఖర్చులు తగ్గుతాయనే మాట నిజమే.. కానీ, ప్రస్తుతం మనుగడలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వలను ధ్వంసం చేసి మళ్లీ నిర్మించి కొత్త కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే రూ.40వేల కోట్ల నుంచి రూ.50 వేల కో ట్లు ఖర్చవుతయి. ఇంత భారం ఎలా సాధ్యం?’ అని మరో సీనియర్ మంత్రి ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.