హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): బడుగు వర్గాలకు చెందిన మంత్రుల శాఖల్లో ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారుల పెత్తనం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు మంత్రులను పట్టించుకోకుండానే సలహాదారులతో పనులు కానిచ్చేస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకు గురువారం వివిధ సంక్షేమ శాఖల గురుకులాలపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షను ఉదాహరణగా చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతోపాటు కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థుల కిట్ల పంపిణీపై సమీక్షించారు. వస్తువుల సరఫరా కోసం కొత్తగా తీసుకొస్తున్న సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంపైన చర్చించారు.
ఇదంతా బాగానే ఉన్నా ఈ కీలక సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల మంత్రుల జాడలేకపోవడం గమనార్హం. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లేకుండానే రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, సీఎం మాజీ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి ఉండడం గమనార్హం. దీంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన అంశంలో బడుగు వర్గాలకు చెందిన మంత్రులను కాకుండా ఉన్నతవర్గాలకు చెందిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని సమీక్ష చేయడంపై తీవ్రంగా విమర్శలొస్తున్నాయి.
ఎవరో ఒక మంత్రి రాలేదంటే ఏదైనా వ్యక్తిగత కారణంతో రాలేదని అనుకోవచ్చని, కానీ ముగ్గురు మంత్రుల్లో ఒక్కరు కూడా రెండు సమీక్షల్లో లేకపోతే ఏమనుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దీనిపై సంచలన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సంక్షేమ, గురుకుల హాస్టళ్ల విద్యార్థులకు 24 వస్తువులతో కూడిన కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఇందుకోసం రూ.1700 కోట్ల బడ్జెట్ అంచనాలున్నాయి. ఈ భారీ కాంట్రాక్టును ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు కట్టబెట్టేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది. ఏకంగా 40 శాతం కమీషన్ కొట్టేసేందుకు స్కెచ్ సిద్ధం చేశారని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సెంట్రలైజ్డ్ టెండర్లలో, వస్తువుల కిట్స్ పంపిణీలో వేరెవరినీ జోక్యం చేసుకోనివ్వొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బడుగు మంత్రులను పక్కన పెట్టారని ఆరోపణలొస్తున్నాయి.