Bhatti | సమస్యల పరిష్కారానికి అనేక అంశాలపై సీఎంల సమావేశంలో లోతుగా చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన సమస్యలతో పాటు పలు సమస్యలపై స్పందించారు. భేటీ అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలపై మాట్లాడుకున్నామన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. ఉన్నత అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీలో సీఎస్, ముగ్గురు సభ్యులు ఉంటారన్నారు. ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.
కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీలు వేస్తామని.. మంత్రుల కమిటీ పరిష్కరించకుంటే సీఎంల స్థాయిలో భేటీలు ఉంటాయన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ తీసుకున్నామని.. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై కలిసి పని చేయాలని నిర్ణయించాం, రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తాయన్నారు. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి అంతా హర్శించే రోజు అన్నారు. నిధులు, నియామకాలు ఉద్యమాలతో తెలంగాణ ఏర్పడిందని, అందరి అభిప్రాయాలను తీసుకోవడానికి అధికారులు, మంత్రుల కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్‌లో ముఖ్యమంత్రులు తరుచూ కలుస్తారన్నారు. డ్రగ్స్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఏపీలో గంజాయి అరికట్టడానికి సబ్ కమిటీ వేసుకున్నామని.. ఏపీ నుంచే గంజాయి తెలంగాణకు వస్తుందని ఇక్కడి సీఎం అంటున్నారని.. రెండు వారాల్లో అధికారుల కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తాయన్నారు. విభజన చట్టంలో అన్ని అంశాలను అధికారుల కమిటీ చర్చిస్తుందన్నారు.