నల్లగొండ ప్రతినిధి, జూలై29(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మంత్రులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొనాలని ముందస్తుగానే నిర్ణయంచారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ముగ్గురు మంత్రులు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో సాగర్‌కు బయలుదేరాల్సి ఉన్నది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్ 9గంటలకే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం రాలేదు. దీంతో ఎయిర్‌పోర్టులో మంత్రులు కోమటిరెడ్డి, లక్ష్మణ్‌కుమార్ కారులో కూర్చొని ఉత్తమ్ కోసం వేచి చూశారు.
ఇలా 45 నిమిషాలపాటు కారులోనే కోమటిరెడ్డి ఎదురుచూశారని తెలిసింది. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. సహచర మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో ఉత్తమ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఇంత ఆలస్యమేంటి? 9గంటలకు షెడ్యూల్ ఇచ్చారు. మనం షెడ్యూల్ ప్రకారమే వచ్చాం. ఆయనేమో ఆలస్యంగా వస్తే ఎట్టా? ఆయన కంటే నేనే సీనియర్ మంత్రిని, ఇదేం పద్ధతి. రమ్మని అవమానించడం కాకపోతే ఏంటి? అంటూ లక్ష్మణ్‌కుమార్ ముందు కోమటిరెడ్డి రుసరుసలాడినట్టు సమాచారం. ‘ఆయన పద్ధతి బాగాలేదు. నేను సాగర్ రాలేను’ అంటూ మంత్రి కోమటిరెడ్డి ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి వెళ్లిపోయారు. విషయం తెలిసిన మంత్రి ఉత్తమ్ కోమటిరెడ్డికి ఫోన్ చేస్తే ఎత్తలేదని తెలిసింది. చేసేదేమీ లేక లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉత్తమ్ గంట ఆలస్యంగా సాగర్ వెళ్లి కృష్ణమ్మకు పూజలు చేసి అనంతరం క్రస్ట్‌గేట్లు ఎత్తారు.