Sunkishala Project | నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు తెల్లముఖం వేసింది. వారం కింద జరిగిన ఘటనపై జలమండలి, ఏజెన్సీ గోప్యత పాటించాయని అందరికీ తెలిసిన సత్యం!. కానీ ఈ రాష్ర్టాన్ని పాలిస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఘటనపై సమాచారమే లేదట! మీడియాలో వస్తేగానీ ప్రభుత్వానికి తెలవలేదట! అవును.. సాక్షాత్తూ ఇద్దరు మంత్రివర్యులే శుక్రవారం ఈ అంశంపై కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ‘ఇది చాలా చిన్న సంఘటన అయినందున, ఇంజినీర్లు వాళ్ల స్థాయిలోనే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి చెప్పలేదు’ అని గోప్యత పాటించిన జలమండలి అధికారుల భుజం కూడా తట్టారు. ఇక.. ప్రమాదానికి కారణాన్ని కూడా మంత్రులు మీడియాకు సెలవిచ్చారు. వేసవిలో నీళ్లివ్వాలనే తాపత్రయంతోనే పనులు త్వరితగతిన చే పట్టారని, దీంతో ప్రమాదం జరిగిందని తేల్చిపారేశారు.
ప్రమాదంతో నష్టమేమీలేదని, కాం ట్రాక్టు సంస్థనే నష్టాన్ని భరిస్తుందంటూ సర్కా రు ఖజానాకు భరోసా ఇచ్చారు. మరి దశాబ్దాలుగా అరిగోస తీస్తున్న రైతులకు సాగునీరివ్వాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం కేవలం మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన దరిమిలా చోటుచేసుకున్న చిన్న లోపా న్ని మాత్రం ఈ మంత్రులే భూతద్దం పెట్టి చూ పించడం గమనార్హం. మరోవైపు సుంకిశాల ఘటనపై గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘ఠాట్.. ఇదంతా బీఆర్ఎస్ పాపమే’ అని వ్యాఖ్యానించగా శుక్రవారం సుంకిశాల పర్యటనలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల ‘త్వరితగతిన నీళ్లివ్వాలనే తాపత్రయంలోనే ప్రమా దం జరిగింది’ అంటూ స్వరం మార్చారు. శుక్రవారం సుంకిశాల సందర్శనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వస్తున్నారంటూ ముందుగా సమాచారం విడుదల చేసినా ఆయన మాత్రం సొంత జిల్లాలోనే ఉండిపోయి, సందర్శనకు రాకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల ప్రాజెక్టు ను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కోదాడకు వెళ్లి అక్కడ తుమ్మల నాగేశ్వర్రావును ఎక్కించుకొని సుంకిశాలకు చేరుకున్నారు. ముందుగా పంపుహౌస్ వద్ద గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరంమీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం దృష్టికి రాలేదు : తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ ‘వచ్చే వేసవికి నీళ్లివ్వాలి కాబట్టి థర్డ్ టన్నెల్ ఓపెన్ చేసి పనులను ఆలస్యం కాకుం డా చూడాలని తొందరపడి ఉండొచ్చు. నీళ్లివ్వాలన్న తాపత్రయం ఉండొచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా? పనిలో ఉన్న నాణ్యత ఏమిటి? ఘటనకు కారణం ఏమిటి? అన్నది తేలాల్సి ఉన్నది. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం దృష్టికి రాలేదు. చిన్న సంఘటన కాబట్టి రెక్టిఫై చేసుకుంటామనే ఉద్దేశంతో ఇంజినీర్లు లేదా ఏజెన్సీ, అధికారులు ప్రభుత్వం దృష్టికి తేలేదు’ అని వెల్లడించారు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ప్రభు త్వం స్పందించి కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పామని, బాధ్యులెవరనేది ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ‘ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి.. తప్పు జరిగినా ఒప్పు జరిగినా పూర్తి చేయాల్సిందే. ఈ పథకాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది’ అని చెప్పారు.
సీఎంపై విమర్శలు సరికాదు : గుత్తా
సుంకిశాల ఘటనపై దురుద్దేశపూర్వకంగా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నా రు. మున్సిపల్ శాఖ సీఎం వద్ద ఉన్నంత మా త్రాన ఆయనపై విమర్శలు చేయడం పాత మున్సిపల్ మంత్రి(కేటీఆర్)కి తగదన్నారు. ‘హైదరాబాద్‌లో అసలు నీళ్ల కొరత లేదు.. సుం కిశాల ప్రాజెక్టు అవసరమే లేదు.. నిన్నటి దాక ప్రభుత్వంలో ఉండి నిరుపయోగమైన ప్రాజెక్టు ను ప్రజల మీద రుద్దుతూ ఇపుడున్న ప్రభుత్వం మీదనో.. సీఎం మీదనో దుమ్మెత్తి పోస్తాననడం సరికాదు. కాబట్టి జరిగిన ఘటనలో మంచిగానీ, చెడుగానీ మీ ఖాతాలోనే ఉంటుంది’ అని గుత్తా వ్యాఖ్యానించారు. రూ.1400 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టు ప్రస్తుతం రూ.2200 కోట్లకు చేరిందని, రానున్న కాలం లో నాలుగు వేల కోట్లకు చేరినా ఆశ్చర్యం అక్కరలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టును కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రారంభించారో వారికి గాని, కాంట్రాక్టు సంస్థకు గాని తెలవాల్సి ఉంద న్నారు. ‘ఏదేమైనా ఒక ప్రభుత్వం ప్రారంభించి రూ.840 కోట్లు ఖర్చు చేసింది. డిసెంబర్ నుంచి ఈ ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చు చేసింది. వాస్తవంగా రూ.2200 కోట్లు పెట్టి టన్నెల్ పూర్తి చేస్తే గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఈ ఘటనలో టెక్నికల్‌గా కాంట్రాక్టరే కడుతాడు. ప్రభుత్వం మీద భారం పడనియ్యం అనేది మరో విషయం. దీనంతటికీ కారణం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే’నని వ్యాఖ్యానించారు.
ఘటన చిన్నది.. నష్టం తక్కువ : మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ వాస్తవ పరిస్థితిని ఫీల్డ్‌లో పరిశీలించి, ఫీల్డ్ ఇంజినీర్లు, ఏజెన్సీతో మాట్లాడి ప్రభు త్వం ఎలా ముందుకు పోవాలో తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. ‘జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. అది కూడా బాధాకరమే. కానీ ఒకట్రెండు నెలలు పనుల ఆలస్యం త ప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టు సంస్థనే భరిస్తుంది. ప్రభుత్వానికి నష్టమేమీ లేదు. ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ని ర్మాణంలో ఉన్నది. ఈ ప్రాజెక్టు అన్ని విధా లా పూర్తయ్యాక ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిన బాధ్యత వాళ్లదే. జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ ఘటన వల్ల ఒకట్రెండు నెలలు ఆలస్యమవుతుంది. ప్రాణనష్టం జరగలేదు. జరిగిన నష్టం ఎంతైనా సరే కాంట్రాక్టరే భరిస్తారు. ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం’ అని చెప్పారు.
‘ఎందుకు ప్రతిపక్ష నేతలు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదు. డిజైన్ చేసింది మీరు.. కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు.. నిర్మా ణం జరిగింది మీ హయాంలో.. మీ కమీష న్ కక్కుర్తో ఏమో గానీ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఒక్కసారి ఆలోచన చేయాలి. 2014లో అధికారంలోకి వస్తే ఎన్నికలకు ఒకట్రెండు ఏండ్ల ముందు పనులు మొదలుపెట్టడంలో మతలబేమిటో ఆలోచించా లి. ఇదంతా మీరే చేసినా పడిపోవడం దురదృష్టకరం అంటున్నం. దీని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టమేం లేదు. మొత్తం ఖ ర్చు కాంట్రాక్టర్ భరిస్తారు’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత కృష్ణాబేసిన్‌కు, దక్షిణ తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. ‘దీనికారణంగానే ఎల్ఎల్బీసీ టన్నెల్ పూర్తికాలేదు, ఈ ప్రభుత్వం పక్షాన.. సీఎం పక్షాన స్పష్టమైన హామీ ఇస్తున్నం.. మా హయాంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తం. డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తిచేస్తం’ అని చెప్పారు.