హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలే పలుమార్లు చెప్పుకుంటారు. ఒక నేతపై మరొక నేత బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం, ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సర్వసాధారణం. అవసరమైతే మీడియా సమావేశాలు పెట్టి మరీ తమ ప్రత్యర్థుల లోటుపాట్లు వివరిస్తారు. పార్టీ వరకైతే అది వారి అంతర్గత వ్యవహారం.. కానీ ప్రభుత్వంలో కూడా వారి వ్యవహారం అదే తీరుగా ఉన్నట్టు తాజాగా జరిగిన ఓ ఘటన వెల్లడిస్తున్నది. ఓ మంత్రిత్వ శాఖ వ్యవహారంలో మరో మంత్రి జోక్యం చేసుకోవడంతో అది వివాదాస్పదమైనట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో గనుల శాఖను మంత్రి వివేక్ నిర్వహిస్తుండగా, అటవీశాఖకు మంత్రి కొండాసురేఖ బాధ్యత వహిస్తున్నారు.
కాగా మంత్రి వివేక్ తనది కాని అటవీశాఖలో తలదూర్చడమే వివాదానికి కారణమని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. నాలుగు రోజుల కిందట మంత్రి వివేక్ సచివాలయంలో అటవీ శాఖ అధికారులను పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. అటవీశాఖ ముఖ్యకార్యదర్శి నదీం అహ్మద్, చీఫ్ ఫారెస్ట్ అధికారిణి సువర్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరులో అటవీ భూముల మీదుగా వెళ్తున్న రహదారులకు క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై చర్చించినట్టు తెలిసింది. అయితే ఈ సమావేశం గురించి అటవీశాఖ మంత్రి కొండాసురేఖకు కనీస సమాచారం కూడా లేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. సదరు సమీక్ష గురించి మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి లోనయ్యారని సమాచారం. తనకు తెలియకుండా వేరొక మంత్రి తన శాఖలో వేలు పెట్టడం ఏమిటని కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అకడి అధికారులను మాత్రమే సమావేశానికి పిలవాల్సిందని, తన ప్రమేయం లేకుండా అటవీశాఖ ముఖ్య అధికారులను పిలిచి ఎలా సమీక్ష నిర్వహిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.