సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మొన్న కిసాన్.. నేడు జవాన్‌ను రోడ్డుమీద పడేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ సర్కారుకే దక్కుతుందన్నారు. బీజేపీ సర్కారు ఒకపక్క ప్రభుత్వ రంగ సంస్థలను తమ మిత్ర కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ..మరో పక్క పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి లక్షల కోట్లు అక్రమంగా ఆదాయం పొందుతున్నదని మండిపడ్డారు. దేశ రక్షణను మాత్రం గాలికి వదిలేసి బేరాలాడుతూ ఖర్చుకు వెనుకాడుతున్నదని విమర్శించారు. ‘అగ్నిపథ్ పథకం’ తెచ్చి దేశ రక్షణ కోసం తమ సేవలు అందించాలనుకునే ఆసక్తిగల దేశ యువతను బీజేపీ ఘోరంగా అవమానిస్తోందన్నారు.
దేశాన్ని సాకే రైతన్నలు, దేశానికి రక్షణగా నిలిచే సైనికులను నిర్లక్ష్యంగా చూడడం హేయమైన చర్య అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ‘బీహార్, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారు.? అక్కడ కూడా టీఆర్ఎస్ ఉన్నదా?’ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మూర్ఖపు నిర్ణయాల వల్ల నేడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు కనిపిస్తలేవా..? అని అడిగారు. బండి సంజయ్ లాంటి రెచ్చగొట్టే నేతల వల్లే దేశంలో అశాంతి, అభద్రత నెలకొంటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. యువత సంయమనం పాటించాలని, కేంద్ర సర్కారు నిర్ణయంపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. జీవితం చాలా విలువైనదని, న్యాయమైన డిమాండ్‌ను గాంధేయమార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకుందామని ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.