ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 01:11:53

మీ రాష్ర్టాల్లో పంటలు కొంటున్నారా?

మీ రాష్ర్టాల్లో పంటలు కొంటున్నారా?

  • ఉంటే చెప్పండి రాజీనామా చేస్తా  
  • బీజేపీ నేతలకు మంత్రి వేముల సవాల్‌

నిజామాబాద్‌, జనవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధానమైన బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, బీహార్‌లో తెలంగాణ మాదిరిగా ఊరూరా పంటల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఒక వేళ లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్‌తోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్‌ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ స్వీకరించాలన్నారు. ఇదొక్కటే కాదు ఇంకా ఎన్నో పథకాలున్నాయని మంత్రి తెలిపారు. నిజామాబాద్‌లో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, ఎమ్మెల్సీలు లలిత, వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌రావులతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు.

నిజామాబాద్‌లో రూ.6.15 కోట్లతో నిర్మించనున్న న్యాక్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. మోర్తాడ్‌ మండలంలో పలు అభివృద్ధ్ది పనులను ప్రారంభించారు. మోర్తాడ్‌లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నిజామాబాద్‌లో మీడియాతోనూ మాట్లాడుతూ.. బీజేపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అభాగ్యులకు రూ.2,016 పింఛన్‌ అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్‌లో రూ.750, ఉత్తరప్రదేశ్‌లో రూ.600, బీహార్‌లో రూ.500 మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. మూడున్నరేండ్లలో  కాళేశ్వర ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ పూర్తి చేశారని కొనియాడారు. ఇలాంటి ప్రాజెక్టు పూర్తి చేసిన మగాడు బీజేపీలో ఉంటే చూపిస్తారా? అని వేముల ప్రశ్నించారు. కేసీఆర్‌లాంటి వ్యక్తి బీజేపీలో సీఎంగా ఉన్నట్టు చూపెడితే ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే బీజేపీ రాష్ట్ట్ర అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సంజయ్‌కి మంత్రి వేముల సవాల్‌ విసిరారు.