Minister Prashanth Reddy | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ కుటుంబమేనని, బండి ఇకనైనా తెలుసుకుంటే మంచిదని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రా న్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే దేశంలోనే నెం.1గా ఎదిగిందని గణాంకాలతో సహా పార్లమెంట్ సాక్షిగా కేం ద్ర మంత్రులే వెల్లడించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, వారి కుటుంబసభ్యులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి వ్యాఖ్యలపై మంత్రి వేముల గురువారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
విదేశీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడానికి యువ నాయకుడు కేటీఆర్ చేసినంత కృషి.. ప్రధాని కూడా చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంసృతిని విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కొడుకు, కూతురు ప్రజామోదంతో రాజకీయాల్లో ఉన్నారని, ఉద్య మం కోసం అమెరికాలో వారి ఉన్నత ఉద్యోగాలు, విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. మంత్రి కేటీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 18 వేల కంపెనీలు, 16 లక్షల ఉద్యోగాలు లభించాయని గుర్తుచేశారు. ప్రధాని మోదీ తన మిత్రుడు అదానీ కోసం పైరవీలు చేసి శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారత పరువు మంటగలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఢిల్లీలో క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. దేశంలో ఏ రంగాన్ని బీజేపీ ఉద్ధరించిందని గొప్పలు చెప్పుకుంటున్నారని నిలదీశారు. 5 నెలల్లో బీఆర్ఎస్ కాదు.. మోదీ పత్తా లేకుండా పోతారని హెచ్చరించారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని, బండి సంజయ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఒక సీటు కూడా గెలువలేదని, నీ వల్ల ఏం కాదని నీ చుట్టూ ఉన్నవాళ్లే చాటుకు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన ప్రగతి మీద జరుగుతున్నాయని, బండి కుటుంబసభ్యులు కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారులే అని, అతని దగ్గరి బంధువులూ ఈ ఉత్సవాలు జరుపుకుంటారని.. వారిని అడిగి తెలుసుకోవాలని బండికి సూచించారు.