నిజామాబాద్ సెప్టెంబర్ 13 : కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నిజామాబాద్ జిల్లా భీమ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంత్రి వేముల ప్రశాంత్ బుధవారం తనిఖీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. తాను మళ్లీ ఆకస్మిక తనఖీలకు వస్తానన్నారు.
విద్యార్థినులకు నాణ్యమై భోజనం, వసతి కల్పించకపోతే ఎంతటివారినైన ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి వేముల స్పష్టం చేశారు. మంత్రి ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంటగది, టాయిలెట్స్, స్టోరూమ్ పరిశీలించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలేమైనా ఉంటే తాను పరిష్కరిస్తానని, బాగా చదువుకోవాలని విద్యార్థినులకు భరోసా కల్పించారు. వంటగది, స్టోరూం, బాత్ పరిశుభ్రంగా ఉండడానికి చేయాల్సిన చిన్నచిన్న పనులను వెంటనే ప్రారంభిం చాలని ఆధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అక్కడి నుంచే జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి వేముల పలు సూచనలు చేశారు.