గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పవిత్ర రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మారుస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌లా కాకుండా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రతిపక్షాలలాగే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గవర్నర్ ఎంతో హుందాగా మెదలాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తిట్టి మీడియాలో హైలెట్ కావాలనుకునే సగటు రాజకీయ నేతలా ఆమె ప్రవర్తన ఉందని విమర్శించారు. ఇకనైనా రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకురాలిగా కాకుండా గవర్నర్‌గా బాధ్యతాయుతంగా మెలగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.