హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ఆ పార్టీ నాయకత్వం భ్రమల్లో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు. వాపును చూసి బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్, ముచూర్ ,బాబాపూర్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ నాయకులు, యువకులు ఆదివారం హైదరాబాద్లో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలన రైతులు, పేదల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కర్ణాటక (Karnataka)గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని భ్రమలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ(BJP) అంటేనే బడా జూటా పార్టీ అని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలుకొని రాష్ట్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడి వరకు నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్యాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణపై నరేంద్ర మోదీ ( Narendra Modi) ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని స్పష్టం చేశారు. సాగునీటి రంగంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవనం పథకం, 21 ప్యాకేజీ ద్వారా, మిషన్ కాకతీయ, చెక్ డ్యాం ల ద్వారా నిరంతరం పంటలకు నీరందిస్తున్నామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన ప్రముఖులు
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ భీంగల్ మాజీ మండల అధ్యక్షుడు, జిల్లా పార్టీ కార్యదర్శి కర్నె సత్య గంగయ్య, బీజేపీ నేత మాసం మధు, చింతకుంట సాయి, ముచూర్ గ్రామానికి బిసిరి బాల కృష్ణ, బాబాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ ధరణి కోట అశోక్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధు శేఖర్,రాజారాం యాదవ్, భీంగల్ మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.