హైదరాబాద్, మే20 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత ఏజెన్సీలను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయా ఏజెన్సీలతోపాటు, ఇరిగేషన్‌శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను మంగళవారం నిర్వహించారు. ఎన్డీఎస్ఏ నివేదిక, ఎస్ఎల్బీసీ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు.
బరాజ్‌ల పునరుద్ధరణపై కూడా ఇరిగేషన్ ఇంజినీర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జలసౌధలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ధర్మారెడ్డిపల్లి కెనాల్, పిలాయిపల్లి కెనాల్, బునాదిగాని కెనాల్స్ పనులపై సమీక్షించారు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.