Devadula Project | వరంగల్, మార్చి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన డొల్లతనాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను నిర్మించే పనులను ఎలాగూ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ పూర్తి చేసిన వాటిని ప్రారంభించే విషయంలోనూ అభాసుపాలైంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను తమ గొప్పలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ మరోసారి అదే పని చేయబోయి నవ్వుల పాలైంది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని మూడో దశ ఆయకట్టు ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద నిర్మించిన పంపింగ్ వ్యవస్థను బుధవారం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో వచ్చి దేవన్నపేట పంప్‌హౌజ్ వద్ద పూజలు చేశారు.
మోటర్‌ను ఆన్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదు. దీంతో సాగునీటి శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడి నుంచి వరంగల్ నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. మోటర్లు ఆన్ అయిన తర్వాతే హైదరాబాద్‌కు వెళ్తామని విలేకరుల సమావేశంలో ప్రకటించామని, ఎంత రాత్రి అయినా ఆన్ అయ్యేలా చూడాలని అధికారులను బుజ్జగించారు. ఈ నెల 20 తర్వాతే పంపింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పినా పట్టించుకోకుండా హడావుడి చేస్తే తాము ఏమీ చేయలేమని అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టులో మూడో దశ కింద రామప్ప చెరువు నుంచి ఉనికిచర్ల వరకు రూ.1494 కోట్లతో టన్నెల్, దేవన్నపేట పంప్‌హౌజ్ పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసింది. గోదావరి నుంచి దేవాదుల పంప్‌హౌజ్‌ల ద్వారా భూపాలపల్లి జిల్లాలోని భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు అక్కడి నుంచి రామప్ప చెరువుకు చేరిన నీటిని వరంగల్ శివారులోని ఉనికిచర్ల వరకు 43.06 కిలోమీటర్ల టన్నెల్లో నీరు ప్రవహిస్తుంది. టన్నెల్లో ఉనికిచర్ల వరకు వచ్చిన నీటిని 6.86 మీటర్ల దూరంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు దేవన్నపేట వద్ద ఏర్పాటు చేసిన పంపులతో తరలించేలా పనులు పూర్తయ్యాయి. దేవన్నపేట పంప్‌హౌజ్ నిర్వహణకు అవరసరమైన కరెంటు, సాంకేతికతను ఏర్పాటు చేశారు. దేవన్నపేట పంప్ హౌజ్ పనులను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది. ఆస్ట్రియా నుంచి భారీ సామర్థ్యం ఉన్న మోటర్లను తెచ్చి అమర్చారు. సాంకేతిక నిపుణులు ఆస్ట్రియా నుంచి రావాల్సి ఉన్నది. పేరు కోసం మంత్రులు వచ్చి మాన్యువల్ పద్ధతిలో ఆన్ చేయడం వల్ల పంపింగ్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని సాగునీటి శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేసే విషయంలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దేవాదుల ప్రాజెక్టుతో వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 5.57 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పూర్తిచేసింది. దేవాదుల ప్రాజెక్టు మూడు దశలలో ఉన్నది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిలోని దేవాదుల ప్రాజెక్టు పంప్‌హౌజ్ నుంచి మూడు మార్గాల్లో హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్‌కు నీరు పంపింగ్ జరిగేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
ఒకటో దశలో 5.18 టీఎంసీలు, రెండో దశలో 7.25 టీఎంసీలు.. మూడో దశలో 25.75 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా పంపింగ్ చేసేలా ప్రాజెక్టును మార్చింది. గోదావరి నుంచి ఏడాది పొడవునా 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో ఈ నిర్మాణాలు జరిగాయి. దేవన్నపేట పంప్‌హౌజ్‌తో వారంలోనే ధర్మసాగర్ రిజర్వాయర్ నిండనున్నది. ధర్మసాగర్ నుంచి జనగామ, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఆయకట్టుకు నీరు అందుతుంది.
దేవన్నపేట పంప్‌హౌజ్ ప్రారంభోత్సవం పేరిట జరిగిన కార్యక్రమం ఆగమాగమైంది. సాగునీటి శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యేలు నాగరాజు, కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఫొటోలను పెట్టలేదు. మంత్రులు అక్కడికి వచ్చే ముందు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించి చెప్పడంతో అధికారులు హడావుడిగా దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. వేరే ఫ్లెక్సీలలో ఉన్న ఫొటోలను కత్తిరించి ఇక్కడి ఫ్లెక్సీలో అంటించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీ రగడతో ప్రెస్‌మీట్‌ను వేరేచోటికి మార్చారు. అక్కడ సాగునీటి శాఖ అధికారులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిట్స్ వివరాలు లేవని, వ్యవహార శైలి బాగాలేదని, దేవాదుల పంపింగ్ నిర్వహణలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.