హైదరాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి, జూరాల మెడకు మరో గుదిబండను తగిలిస్తూ కృష్ణాజలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా అబద్ధాల పీపీటీ(పవర్‌పాయింట్ ప్రజెంటేషన్)ని ప్రదర్శించింది. తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోలేక, సమర్థించుకోలేక సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నానాతంటాలు పడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలను కేటాయించగా, కాంగ్రెస్ సర్కార్ తాజాగా దానిని 45 టీఎంసీలకు కుదించిన సంగతి తెలిసిందే. ఆ మేరకే అనుమతులివ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిం ది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిలదీశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ‘కృష్ణా జలాల’ అంశంపై లఘుచర్చ నిర్వహించింది. మంత్రి ఉత్తమ్ పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ మూడేండ్లలో పూర్తిచేస్తామని ప్రకటించారు. మరోవైపు కృష్ణాజలాల్లో బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం జరిగిందంటూ పాతపాటే పాడారు. అర్ధసత్యాలు, అర్ధ గణాంకాలు వెల్లడిస్తూ బీఆర్ఎస్నే దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాసిన లేఖలను వక్రీకరించారు.
తాత్కాలిక వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే
కృష్ణాజలాల్లో 299 టీఎంసీలు చాలని మాజీ సీఎం కేసీఆర్ సంతకాలు చేశారని, తాము అధికారంలోకి వచ్చాక ట్రిబ్యునల్ ఎదుట నీటి పంపకాల కు వాదనలు వినిపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ వాదన అసత్యమని ఇప్పటికే బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్పింది. ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి ఇరురాష్ర్టాల మధ్య పంపకాలు చేపట్టేవరకూ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగానికి కేవలం ఏడాది కాలపరిమితి కోసం తాత్కాలికంగా చేసుకు న్న వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే అని బీఆర్ఎస్ స్పష్టంచేసింది. ఈ విషయం నాటి మీటింగ్ మినిట్స్‌లోనూ కేంద్రం స్పష్టంగా పేర్కొన్నది. ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్-3 ప్రకారం విచారణ కొనసాగించడం కూడా బీఆర్ఎస్ ఘనతే. వాస్తవానికి విభజన చట్టంలో సెక్షన్-89 ప్రకారం అప్పటికే కేటాయించిన జలాలను అంటే, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను ప్రాజెక్టులవారీగా మాత్రమే పంపిణీ చేయాలని సూచించింది.
కానీ, దానివల్ల తెలంగాణకు ఒరగబోయేది ఏమీ ఉండబోదని కేసీఆర్ ప్రభుత్వం గ్రహించింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం-1956, సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి తెలంగాణకు న్యాయమైన వాటా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన 42 రోజుల్లోనే కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేసి వచ్చారు. కేంద్రం తొమ్మిదేండ్లపాటు సుదీర్ఘకాలయాపన చేసి చివరికి సెక్షన్-3 ప్రకారమే విచారణ కొనసాగించి నీటిపంపకాలు చేపట్టాలని 2023లో నిర్ణయించింది. ప్రస్తుత ట్రిబ్యునల్‌కే అదనపు అధికారాలను కల్పించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. ఈ విషయాలేవీ పీపీటీలో ఉత్తమ్ ప్రస్తావించకుండా తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా వక్రీకరించడమేగాక, ట్రిబ్యునల్ ఎదుట వాదనలను వినిపిస్తున్నామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు.
ఏపీ జలదోపిడీకి అవకాశమిచ్చిందెవరు?
పొరుగున ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను దోచుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అర్ధసత్యాలను అసెంబ్లీలో నివేదించారు. వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీని తెరమీదకు తెచ్చిందే కాంగ్రెస్. శ్రీశైలం ప్రాజెక్టుకు గండిపెట్టి తెలంగాణ జలాలకు తూట్లు పొడించిందే హస్తం పార్టీ. 1,500 క్యూసెక్కుల సామర్థ్యం అని పనులు చేపట్టి, తర్వాత 11 వేల క్యూసెక్కులకు విస్తరించి తెలంగాణకు తీరని ద్రోహం చేసింది. 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను ఏకంగా 44 వేల క్యూసెకులకు విస్తరించారు.
అనాడే 88వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పనులను కూడా చేపట్టారు. అదేవిధంగా మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్‌లను ఏర్పాటుచేసి జలదోపిడీకి బాటలు వేసిందే కాంగ్రెస్. ఆ మోసాన్ని గ్రహించే, నిరసిస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకున్నారు. పనులను నిలుపుదల చేయించారు. నాడు తీసిన మట్టి కాలువలకే జగన్ ప్రభుత్వం సిమెంట్ లైనింగ్‌తోపాటు రాయలసీమ లిఫ్ట్‌ను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఆ పనులను అపెక్స్ కౌన్సిల్లో నాటి సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎన్జీటీలో కేసులు వేసి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. అంతేకాదు ఏపీ జలదోపిడీని లెక్కగట్టేందుకు టెలిమెట్రీల ఏర్పాటుకు సైతం బీఆర్ఎస్ సర్కార్ పూనుకున్నది.
మొదటి విడతలో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయించింది. ఫేజ్ 2 కింద 9 చోట్ల ఏర్పాటుచేయాలని 2020లో నిర్వహించిన 14వ బోర్డు సమావేశంలోనే నిర్ణయించారు. అందుకు రూ.7.18కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే ఆ నిధులను ఇరు రాష్ర్టాలు సమంగా భరించాల్సి ఉన్నది. ఏపీ సర్కార్ నిధులను చెల్లించకపోవడంతో ఫేజ్-2 టెలిమెట్రీల ఏర్పాటు సుదీర్ఘంగా వాయిదాపడుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ తొక్కిపెట్టి కేవలం బీఆర్ఎస్నే దోషిగా నిలిపేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నానాతంటాలు పడ్డారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండోదశ టెలిమెట్రీల ఏర్పాటుకు 4.18కోట్లు విడుదలచేసింది. ఏపీ నేటికీ విడుదల చేయలేదు. ఏపీ సమ్మతి లేకుండా టెలిమెట్రీలను ఏర్పాటుచేసేది లేదని రివర్ బోర్డు ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ విషయాలను సైతం మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రస్తావించకుండా బీఆర్ఎస్పై ఆరోపణలకే పరిమితయ్యారు.
ఆద్యంతం బీఆర్ఎస్ను దోషిగా నిలిపేందుకే
కృష్ణాజలాలపై పీపీటీలో ఆద్యంతం బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌ను నిందించడానికి, దోషిగా నిలిపేందుకే మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. డీపీఆర్‌ను 2022 వరకూ సమర్పించలేదని, జీవో 35వేల కోట్ల కు ఇచ్చి ప్రాజెక్టు అంచనాలను 55వేలకు కోట్లను పెంచిందని ఆరోపించింది. గతంలోనూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను తిప్పిపంపారని, తమ హయాంలోనూ డీపీఆర్‌ను తిప్పిపంపారని సమర్థించుకునేందుకు మంత్రి ఉత్తమ్ యత్నించారు. బీఆర్ఎస్ హయాంలో డీపీఆర్ తిప్పిపంపితే అనుమతులెలా వచ్చాయో అనే వాస్తవాలను మాత్రం మంత్రి వెల్లడించలేదు. ప్రాజెక్టుకు అనుమతుల సాధనకు కృషి చేస్తున్నామని, పనులకోసం తమ ప్రభుత్వం 7వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. కృష్ణాబేసిన్‌లోని డిండి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని తెలిపారు. నల్లమలసాగర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులివ్వలేదని, ముందస్తుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని వివరించారు. ఇరురాష్ర్టాల మధ్య ఉన్న జలవివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తే తప్పేంటని సమర్థించుకున్నారు. కృష్ణా, గోదావరిలో ఒక్క చుక్క తీసుకుపోనివ్వబోమని, అందుకోసం ఎవరితోనైనా మాట్లాడుతామని వివరించారు.
జూరాల దుస్థితికి కారణమెవరు?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి సోర్సును జూరాల నుంచి మార్చి చారిత్రక తప్పిదం చేశారని ఓ వైపు చెప్తూ, మరోవైపు జూరాల నుంచి కేటాయించిన జలాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించలేదని అసెంబ్లీలో ఉత్తమ్ పేర్కొన్నారు. ఆయకట్టుకు సరిపడా సాగునీటిని అందించాలంటే ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వసామర్థ్యం అత్యంత కీలకం. ఎత్తిపోతల పథకాల్లో 70% నిల్వ సామర్థ్యం ఉండాలని కేంద్ర సంస్థలు చెప్తున్నాయి. జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, లైవ్ కెపాసిటీ 6.8 టీఎంసీలు మాత్రమే. వరద వచ్చేది కూడా తక్కువ రోజులే. ఈ ప్రాజెక్టుపైనే భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్ట్‌లను ఏర్పాటుచేశారు. 59 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే సాగునీటిని అందించాల్సి ఉన్నది. తాగునీటి అవసరాలను కలుపుకొని మొత్తంగా 64 టీఎంసీలను వినియోగించుకోవాలి. అంటే కేంద్రం లెక్కల ప్రకారం జూరాలపై ఆధారపడి కనీసం 45 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మించాలి. కానీ, నాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు కలిపి డిజైన్ చేసిన నిల్వ సామర్థ్యం కేవలం 20 టీఎంసీలు.. అంటే సగం కన్నా తక్కువే. జూరాల నుంచి వానకాలంలోనే ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వలేని దుస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా యాసంగిలో నీరివ్వలేమని క్రాప్‌హాలిడే ప్రకటించింది. వాస్తవాలు ఇలా ఉంటే, గతంలో కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదాలను ప్రస్తావించకుండా కేవలం బీఆర్ఎస్పైనే బురద జల్లేందుకు మంత్రి ఉత్తమ్ తంటాలుపడ్డారు.