నాగర్‌కర్నూల్ : ఈ సంవత్సరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నిర్మించిన అంజనగిరి రిజర్వాయర్ (Anjanagiri Reservoir)ను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.
ఈ శాసనసభ కాలంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగిలిన నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమ తదితర ఎత్తిపోతలు, ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్డర్ రాజేష్ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు.