హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు మరోసారి అక్కసు వెళ్లగక్కింది. గతంలో మాదిరిగానే అడ్డగోలు ఆరోపణలకు దిగింది. ఎన్డీఎస్ఏ నివేదికనూ వక్రీకరిస్తూ బీఆర్ఎస్పై బురదజల్లుతున్నది. రిపోర్టుపై ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ సర్కారు కుటిలనీతిని బయటపెట్టుకున్నారు. ఎన్డీఎస్ఏ ఉటంకించని అవినీతిని కూడా ఆపాదిస్తూ అడ్డగోలు ఆరోపణలకు, అసత్య ప్రచారానికి పూనుకున్నారు. కాళేశ్వరం నిరర్ధక ప్రాజెక్టు అని ముద్ర వేసేందుకు మరోసారి యత్నించారు. పేరుకు ఎన్డీఎస్ఏ నివేది క అంశాలపై ప్రెస్‌మీట్ పెట్టినా, పూర్తిగా రాజకీయ ఆరోపణలకే మంత్రి ఉత్తమ్ దిగారు. పాడిందే పాడరా.. అన్నచందంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీఇంజినీరింగ్, నీటిలభ్యత, నిర్మాణ వ్యయం పెంపుపై ప్రతిపక్షం లో ఉన్న నాటినుంచి చేస్తున్న ఆరోపణలనే ఏకరువు పెట్టారు. మేడిగడ్డ కూలిపోయిందని, తెలంగాణకు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, భారీ అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారానికి మరోసారి పూనుకున్నారు.
నివేదికను వక్రీకరించి..
ఎన్డీఎస్ఏ 378 పేజీలతో నివేదికను సమర్పించింది. ఆ నివేదికలోని అన్ని అంశాలను వివరించకుండా మంత్రి ఉత్తమ్‌కుమార్ కొన్ని అంశాలకే పరిమితమయ్యారు. తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పలు అంశాలను వక్రీకరించి ఆరోపణలకు దిగారు. మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్ నిర్మాణాలు పూర్తిగా కూలిపోయాయని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేసిందని మంత్రి పేర్కొన్నారు. వాస్తవానికి నిర్దిష్ట పరీక్షలను నిర్వహించిన అనంతరం 7వ బ్లాక్‌ను పునరుద్ధరించాలని, తద్వారా మేడిగడ్డ బరాజ్‌ను వినియోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టంచేసింది. ఈ విషయాన్ని మాత్రం మంత్రి తొక్కిపెట్టారు. మేడగడ్డ 7వ బ్లాక్ వద్ద ఏర్పడిన సాంకేతిక సమస్యలు.. ఇతర బ్లాకుల్లో, అన్నారం, సుం దిళ్ల బరాజ్‌ల్లో తలెత్తవచ్చని, ముందస్తుగా అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని మాత్రమే ఎన్డీఎస్ఏ ఊహాజనితమైన సలహా ఇచ్చింది. కానీ, మంత్రి ఉత్తమ్ మాత్రం మేడిగడ్డ తరహాలోనే అన్నిబ్లాకుల్లో సమస్యలు ఉన్నట్టు పూర్తిగా వక్రీకరించారు.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ స్థలాలను మార్చారని, ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా, ఎవరినీ సంప్రదించకుండానే బరాజ్‌లను నిర్మించారని ఎన్డీఎస్ఏ పేర్కొన్నదని మంత్రి ఆరోపించారు. కానీ, ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ప్రతిపాదిత స్థలాల మార్పు అనేది సహజం. గతంలో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలాలను కూడా మార్చారు. ఇదిలావుంటే, లొకేషన్ మార్చినంత మాత్రాన ఎలాంటి భూభౌతిక పరీక్షలను చేయకుండా ఏ ఇంజినీర్ కూడా నిర్మాణాలను చేపట్టరు. నిజానికి, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్లను నీటినిల్వ సా మర్థ్యం, ముంపు నివారణ తదితర అంశాల నేపథ్యంలోనే మార్చారు. ఆ రెండు బరాజ్‌లను నిర్మించే ప్రాంతాల్లో అన్ని రకాల సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. మేడిగడ్డ వద్ద జాదవ్‌పూర్ యూనివర్సిటీ ద్వారా జియో టెక్నికల్, ఫిజికల్ పరీక్షలను నిర్వహించగా, ఐఐటీ హైదరాబాద్ వాటిని పరిశీలించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి ముందు కూడా ఏజెన్సీలు అన్ని సాంకేతిక పరీక్షలను నిర్వహించగా, ఎన్ఐటీ వరంగల్ పర్యవేక్షించింది. ఈ అంశాలను ఎన్డీఎస్ఏ నివేదికలోనే పొందుపరిచారు. కానీ, మంత్రి ఉత్తమ్‌కుమార్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆరోపణలకు దిగారు.
మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్ కుంగుబాటు ఘటనపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను గత ఏడాది సమర్పించింది. బరాజ్‌ల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. మార్గదర్శకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని, కొన్నింటిని పాక్షికంగా చేపట్టిందని, మరికొన్ని అంశాలను పూర్తిగా వదిలేసిందని ఎన్డీఎస్ తన తుది నివేదికలో నొక్కిచెప్పింది. కానీ, మంత్రి మాత్రం ఆ అంశాల ఊసే ఎత్తకపోవ డం గమనార్హం. మార్గదర్శకాలకు విరుద్ధంగా 7వ బ్లాక్ వద్ద గ్రౌటింగ్‌ను నిర్వహించారని, తద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేమని, సాంకేతిక పరీక్షలను నిర్వహించినా ఆ ఫలితాల కచ్చితత్వం దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న పాక్షిక సమాచారంతోనే నివేదికను ఇస్తున్నట్టు ఎన్డీఎస్ఏ తెలిపింది. ఈ విషయాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను కూడా మంత్రి తొక్కిపెట్టారు. కేవలం రాజకీయ ఆరోపణలకు దిగా రు. మార్గదర్శకాలకు విరుద్ధంగా గ్రౌటింగ్ ఎందుకు చేశారు? అంటే బరాజ్‌ల రక్షణకు అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేయడం కొసమెరుపు. బరాజ్‌లకు సంబంధించి ఎన్డీఎస్ఏ తన నివేదికలో అనేక సూచనలు చేసింది. డాటా అందివ్వడంలో, సూచించిన సాంకేతిక పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ఆ అంశాలను ప్రస్తావించకుండా కేవలం నివేదికలోని కొన్ని ఊహాజనిత అంశాలను సాకుగా చూపి ప్రాజెక్టుపై బురదజల్లేందుకు మంత్రి యత్నించారు.