Tummidihatti Barrage | వరంగల్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గోదావరి నీటిని అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో ఎల్లంపల్లి బరాజ్‌లోకి నీటిని తరలిస్తామని, అక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థతో సాగునీటి సరఫరా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌కి పేరు రావద్దనే ఉద్దేశంతోపాటు ఏదో మతలబుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ని నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు లక్ష్యం నెరవేరేదని, అలా కాకుండా రూ.లక్ష కోట్లు ఖర్చుచేసి కాళేశ్వరం నిర్మించారని అన్నారు. కాళేశ్వరం కోసం గోదావరిలో మూడు బరాజ్‌లు నిర్మించారని, దీనికి బదులుగా తుమ్మిడిహట్టి వద్ద ఒక్కటి పూర్తిచేస్తే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో పియర్ల కుంగుబాటుపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మంత్రులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జీ వివేక్ శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను సందర్శించారు. మేడిగడ్డ బరాజ్ వద్ద మంత్రుల సమక్షంలో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు మీడియా ప్రతినిధులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బరాజ్‌కి మహారాష్ట్ర ప్రతిపాదించిందని చెప్పారు. 38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును పకన పెట్టి లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపం జరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై డబ్బు మొత్తం వృథా అయ్యిందని, లోన్లకు వడ్డీలు పడుతున్నాయని చెప్పారు. మేడిగడ్డ బరాజ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలనే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామని, దీనికోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు.
మేడిగడ్డ బరాజ్‌లో పియర్లు కుంగిపోవడం, అన్నారం బరాజ్‌లో బుడగలు రావడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చామని పరిశ్రమల మంత్రి దుద్దళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని, ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రి ఇప్పటికే సమీక్షించారన్నారు. గ్రావిటీతో పూర్తయ్యే ప్రాజెక్టు బదులు నదిలో మూడు ప్రాజెక్టులు కట్టడం తుగ్లక్ చర్య అని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణలోపాలు గత ప్రభుత్వ తప్పిదమని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టని చెప్పుకున్నారని, వాస్తవం చూస్తే ఉపయోగంలేని ప్రాజెక్టుగా మారిందని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ఆతృత తప్ప ప్రజల ప్రయోజనం లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆర్సీసీ కటాఫ్ వాల్ నిర్మించి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదని చెప్పారు. ప్రొటెక్షన్ వర్స్ ఒక భారీ వరదకే పోయాయని, ఈ ముప్పునకు, ప్రభుత్వ అప్పులకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. బరాజ్ ప్రస్తుత పరిస్థితికి కారణమైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడో టీఎంసీ పనుల కోసం రూ.4 వేల కోట్ల పనులను అదే కంపెనీకి ఏ కారణంతో ఇచ్చారని ప్రశ్నించారు.