హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): వరద జలాల మాటున గోదావరిని కొల్లగొట్టేందుకు చేపట్టిన గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నది. తాజాగా ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు సంబంధించిన టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) కోసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రివర్ వ్యాలీ, హైడ్రోఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీకి (ఈఏసీ) ప్రతిపాదనలను సమర్పించింది. దీనిపై మంగళవారం ఢిల్లీలో జరిగే ఈఏసీ సమావేశంలో చర్చించనున్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, బేసిన్ రాష్ర్టాల అంగీకారం లేకుండానే ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నది. పోలవరం నుంచి బనకచర్లకు రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల వరద జలాలను తరలించే ఈ ప్రాజెక్టును రూ.81 వేల కోట్లతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే విన్నవించడం, దానికి ప్రధాని, ఆర్థిక మంత్రి సానుకూలత వ్యక్తం చేయడం తెలిసిందే.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని కేంద్రం సూచించడంతో ఏపీ ప్రీఫీజములిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను సమర్పించింది. ఆ వెంటనే కేంద్రం హడావుడిగా ఆ పీఎఫ్ఆర్పై అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ సహా బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు, కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు స్పష్టం చేసింది.
జీబీ లింక్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నది. ఏదైనా ప్రాజెక్టుకు చేపట్టేందుకు పర్యావరణ అనుమతులను సాధించాలంటే తొలుత కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలకు దరఖాస్తు చేసుకుని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్మెంట్, భూసేకరణ తదితర వివరాలను నివేదించాల్సి ఉంటుంది.
దానిపై ఈఏసీ చర్చించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లాంఛనంగా మార్గదర్శకాలను జారీ చేస్తుంది. కాగా, జీబీ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దీన్ని ఏపీ ఏమాత్రం పట్టించుకోకుండా, తెలంగాణ అభ్యంతరాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దూకుడుగా ముందుకు సాగుతుండటం, అందుకు కేంద్రం సైతం మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన జీబీ లింక్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను మంజూరు చేయవద్దని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేందర్‌యాదవ్‌కు సోమవారం లేఖ రాశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం జీబీ లింక్ ప్రాజెక్టును చేపడుతున్నదని వివరించారు.
అది పోలవరం ప్రాజెక్టు టీఏసీ అనుమతులను సైతం పూర్తిగా ఉల్లంఘిస్తున్నదని వివరించారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు, సీడబ్ల్యూసీకి లేఖలు రాశామని గుర్తుచేశారు. ప్రస్తుతం పర్యావరణ అనుమతుల టీవోఆర్ కోసం ఈఏసీలో చర్చించాలని నిర్ణయించడం తగదని తెలిపారు. బేసిన్ రాష్ర్టాల అంగీకారం లేకుండా చేపడుతున్న జీబీ లింక్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను ఇవ్వకూడదని ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు.