Tummala Nageswara Rao | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. మరో 20 లక్షల మందికి మాఫీ చేస్తాం.. ఆ త ర్వాతే రైతుభరోసా ఇస్తాం’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
సోమవారం గాంధీభవన్‌లో కార్యకర్తలతో ముఖాముఖి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై రైతుల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించడంలేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో రూ.18 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన విషయం ప్రధానికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
సగం మందికే మాఫీ
రుణమాఫీ విషయంలో సీఎం, వ్యవసాయ మంత్రి పరస్పర విరుద్ధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ ప్రధానికి రాసిన లేఖలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రస్తావించారు. ఆ మరునాడే మంత్రి తుమ్మల 22 లక్షల మందికి రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మందికి వర్తింపజేస్తామని చెప్పడం గమన్హారం. అంటే సగం మంది రైతులకే రుణమాఫీ చేశామని మంత్రి పరోక్షంగా అంగీకరించినట్టయ్యింది. కాగా, 50% రైతులకే రుణాలు మాఫీ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాటలకు మంత్రి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.