హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంపిణీలో జాప్యం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎరువుల పంపిణీలో వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత యాసంగితో పోల్చితే ఈ యాసంగిలో ఎరువులు అధిక మొత్తంలో నిల్వ ఉన్నాయని చెప్పారు. అన్ని ఎరువులు కలిపి నిరుడు 7.02 లక్షల టన్నులు నిల్వ ఉండగా ప్రస్తుతం 8.59 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయినా పంపిణీ ఎందుకు ఆలస్యమవుతున్నదని అధికారులను ప్రశ్నించారు. లారీల సమ్మె కారణంగా నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాల్లో పేరుకుపోయిన వ్యవసాయేతర రుణాలను వారంలోగా వసూలు చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టెస్కాబ్ ఎండీ మురళీధర్‌కు సూచించారు.