హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యూరియా కొరత ఉన్నమాట నిజమేనని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు అంగీకరించారు. యూరియా కొరత ఉన్నందుకు చింతిస్తున్నామని చెప్పారు. ఎరువు నిల్వలు లేకపోవడంతోనే ఇబ్బందులు ఏర్పడినట్టు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నేతలు క్యూలో చెప్పులు పెట్టించి, మహిళలను లైన్లలో నిల్చోబెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రైతులకు బహిరంగ లేఖ రాశారు. పాకిస్థాన్‌తో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ యుద్ధం వల్లే, చైనా నుంచి రావాల్సిన యూరియా రాలేదని, ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా తెలంగాణలో యూరియా కొరతకు కారణమని చెప్పుకొచ్చారు. ఆ రెండు యుద్ధాలు బీఆర్ఎస్ పాలనలో లేవని అన్నారు.
మంత్రి లేఖలో పేర్కొన్న అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కొరతతో రాత్రింబవళ్లు క్యూలో నిల్చుంటున్న రైతుల ఆగ్రహజ్వాలకు.. మంత్రి రాసిన లేఖతో మరింత ఆజ్యం పోసినట్టయిందని రైతు సంఘాల నేతలు దుయ్యబట్టారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైందని, అప్పట్నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. అదే కారణమైతే 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం యూరియాను ఎలా సరఫరా చేయగలిగిందని ప్రశ్నిస్తున్నారు. యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలోనే ఏర్పడని యూరియా కొరత, ప్రస్తుతం సద్దుమణిగేలా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఏర్పడటమేంటని నిలదీస్తున్నారు. మంత్రి లేఖపై సోషల్‌మీడియాలో కూడా విస్తృత చర్చ జరుగుతున్నది. ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఓ చోట ఉద్రిక్తతలు ఉంటాయని, రాష్ట్రంలో యూరియా కొరతకు వాటిని సాకులుగా చూపడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ముందుచూపులేని కాం గ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులు బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న జిమ్మిక్కు రాజకీయాలేనని విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ దుష్ప్రచారం, బురదచల్లడం మానుకుని, పాలనపై, ప్రజల కోసం పని చేయడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ఇప్పుడు ప్రయత్నించడమేంది?
యూరియా కోసం మంత్రిగా తాను, సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీలు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నామని తుమ్మల వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు. కానీ ఈ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నేతలు అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం జరుగుతున్నదని లేఖలో పేర్కొన్నారు. అయితే.. మంత్రి తుమ్మల లేఖలో పేర్కొన్న అంశాలు సెల్ఫ్‌గోల్స్ అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 2020లో కరోనాతో యావత్తు ప్రపంచం స్తంభించిపోయిందని, ఆ సమయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటికి రెప్పలా చూసుకున్నారని గుర్తుచేస్తున్నారు. సకాలంలో రైతుబంధు ఇవ్వడం, ఎరువులు పంపిణీ చేయడం, రైతుల నుంచి ధాన్యం కొనడం వంటి పనులు ఆపలేదని చెప్తున్నారు. రాష్ట్ర రైతుల ఎరువుల అవసరాలు తెలియకుండా, కనీసం పాలనపై అవగాహన, చిత్తశుద్ధి లేకుండా ప్రచారార్భాటాలతో పబ్బం గడిపే ధోరణి మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలుకుతున్నారు.
తమ ప్రభుత్వంపై.. బీఆర్ఎస్ అక్కసు వెళ్లగక్కుతున్నదన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం అంటకాగుతూ పాలనను గాలికి వదిలేసి పబ్బం గడుపుతున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే ఇరుపార్టీల నేతలు కలిసి బీఆర్ఎస్ గత పాలనపై ఒంటికాలిపై లేస్తూ.. బురద చల్లుతున్నారని గుర్తుచేస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులకు యూరియా ఇవ్వకుండా.. తమ వ్యతిరేక వైఖరితో అడ్డంగా దొరికిపోయారని చెప్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ను ఇరికించడం కుదరక.. కాలుకాలిన పిల్లిలా, తేలుకుట్టిన దొంగలా మంత్రి లేఖలో చిందులు తొక్కారని నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. కేసీఆర్‌లా.. రైతులకు మంచి చేయాలనే మనసు, అన్నదాత పట్ల ప్రేమ, రాష్ట్రంపై దార్శనికత ఉంటే పరిష్కారాలు కనుక్కునే మార్గముంటుందని చెప్తున్నారు.
ప్రజాపక్షం.. సామాజిక మాధ్యమం
యూరియా కొరతపై కొందరు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి తుమ్మల మాట్లాడటం దారుణమని, ప్రజల తరపున గొంతెత్తితే పాలకులు సహించలేకపోతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. రైతుల ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమేనన్న తుమ్మల.. ఎవరు ప్రేరేపిస్తే కొరతను అంగీకరించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలంటూ తుమ్మల పేర్కొనడం దారుణమని, అవసరమైన యూరియాలో సగం కూడా సరఫరా చేయకుండా.. ఉచిత సలహాలు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు. యూరియా కొరత రాకుండా ఉండాలంటే దేశీయంగా యూరియా ఉత్పత్తి పెంచాల్సిన అవసరమున్నదని, నానో యూరియా ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించాలని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ధర తక్కువగా ఉండటం వల్లే రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారని, కాంప్లెక్స్ ఎరువుల ధర తగ్గించాలని కేంద్రాన్ని ఇప్పుడు కోరడం విడ్డూరమని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ.. రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నప్పుడు గుర్తుకొచ్చాయా అని, సీజన్‌కు ముందే కేంద్రంతో సంప్రదింపులు ఎందుకు చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కొరతనే లేదంటిరి కదా మంత్రి గారూ!
సోమవారం మంత్రి లేఖతో మరో విష యం ప్రజలకు అర్థమైందని రైతు సంఘాలనేతలు, నెటిజన్లు చెప్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదని, యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని నిన్నమొన్నటి వర కు చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు.. కొరత ఉందనే విషయం ఎప్పుడు జ్ఞానోదయమైందని నిలదీస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో యూరియా కొరత ఏర్పడుతుందని ముందే ఊహించామని చెప్పిన తుమ్మల… ముందే ఎందుకు జాగ్ర త్త పడలేదో లేఖలో చెప్పలేదని మండిపడుతున్నారు. యూరియా కొరత ఏర్పడకుండా ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ ప్రణాళిక ఏంటో చెప్తే బాగుండేదని విమర్శిస్తున్నారు. రైతుల ఆందోళనను కప్పిపుచ్చు తూ, బీఆర్ఎస్పై బురద చల్లేందుకు కాం గ్రెస్ సర్కారు చేసిన ప్రయత్నాలు తిప్పికొట్టడంతో.. నిజాలు ఒప్పుకోక తప్పలేదని నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ప్రజాగ్రహంతో, రైతుల ఆందోళన, బీఆర్ఎస్ పోరాటంతో కొరతను ఒప్పుకున్న మంత్రి.. కనీసం ఇప్పటికైనా పరిష్కారమార్గాల దిశగా ఆలోచించి, అన్నదాతలకు మేలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.