హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు రాష్ర్టానికి కేటాయించిన యూరియాను సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి బుధవారం లేఖలు రాశారు. రాష్ట్రానికి నెలవారీ కేటాయింపులు పంపిణీ చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.
తక్షణమే రాష్ట్ర కోటాను విడుదల చేయాలని కోరారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ర్టానికి కేటాయించిన యూరియా మొత్తం 5 లక్షల టన్నులు కాగా, కేవలం 3.06 లక్షల టన్నులే సరఫరా అయిందని పేర్కొన్నారు. దీని ఫలితంగా 1.94 లక్షల టన్నుల లోటు ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా దిగుమతి ద్వారా వచ్చే యూరియాలోనూ భారీ లోటు ఉన్నదని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో 1.70 లక్షల టన్నులు కేటాయించగా 1.22 లక్షల టన్నులే అందిందని, మే నెలలో 1.60 లక్షల టన్నులకు గాను 88 వేల టన్నులే అందిందని, జూన్ నెలకు 1.70 లక్షల టన్నులకు 96 వేల టన్నులే అందిందని మంత్రి పేరొన్నారు.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా వినియోగం అత్యంత అధికంగా ఉంటుందని, అందువల్ల యూరియా అందకపోతే రైతుల పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకొని రాష్ర్టానికి రావాల్సిన యూరియాను తక్షణమే పంపిణీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.