హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయవర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం గ్రామగ్రామానికి ‘నాణ్యమైన విత్తనం’ కార్యక్రమాన్ని భద్రాద్రి-కొత్తగూడెంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర ్లసమక్షంలో సుమారు 300మంది అభ్యుదయ రైతులకు విత్తన కిట్లను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, వ్యవసాయవర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు.
భువనగిరిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వికారాబాద్‌లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ రైతులకు విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, హనుమకొండ, ములుగు, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండాసురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విత్తన ప్యాకెట్లను అందజేశారు.