హైదరాబాద్, జూలై 27(నమస్తేతెలంగాణ): రాష్ట్రాలకు యూరియా సరఫరాపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు అవగాహనలేమితో అర్థరహిత వ్యాఖ్యలు చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అసహనం వ్యక్తంచేశారు. లెక్కలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఆదివారం ఆయన లెక్కల వివరాలతో కూడిన బహిరంగలేఖను రాశారు. కేంద్రం రాష్ట్రానికి 12 ఎల్ఎంటీఎస్ల యూరియా సరఫరా చేసిందని చెప్పడం విడ్డూరమని, తప్పుడు లెక్కలతో రైతులను తప్పుదోవపట్టించడం సరికాదన్నారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి రైతాంగంపై నిబద్ధతలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సీజన్లో కేంద్రం రాష్ట్రానికి కేవలం 9.80 ఎల్ఎంటీఎస్ల యూరియా మాత్రమే సరఫరా చేసినట్టు తెలిపారు.