రూ.12 వేలనుంచి రూ.15 వేలు అదనంగా వస్తున్నయి. రైతుబంధు కంటే బోనసే బాగుందని చెప్తున్నరు. రైతులు కూడా బోనసే ఇవ్వాలని అంటున్నరు. రైతులకు ఏది మంచిదో చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటాం.
– మంత్రి తుమ్మల
Rythu Bandhu | హైదరాబాద్, నవంబర్29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధుకు కాంగ్రెస్ సర్కారు పూర్తి గా తిలోదాకాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అరకొరగా కొంతమంది వరి పండించే రైతులకు ఇచ్చే బోనస్‌తోనే సరిపెట్టాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా కాంగ్రె స్ సర్కారు ఇచ్చిన హామీ మేర కు రైతుభరోసా కింద 15వేల సా యం కూడా ఆచరణకు నోచుకోకపోవడంపైనా అన్నదాతలు మండిపడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమీస్తాపూర్లో గురువారం నిర్వహించిన రైతుపండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎన్ని బాధలున్నాయో ప్రభుత్వానికి కూడా అన్ని సమస్యలున్నాయంటూ ఏకరవుపెట్టారు. సన్నవడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్‌తో ఒక్కో రైతుకు రూ.12 నుంచి 15వేలు అదనంగా వస్తున్నాయని, కష్టపడే రైతులకే ఫలితం దక్కుతున్నదని, రైతుబంధు కంటే బోనసే బాగుందని రైతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుబంధు ఇవ్వకుండా బోనసే ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, రైతులకు ఏది మంచిదో చెబితే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైతుబంధు పథకానికి ప్రభుత్వం మొత్తంగా తిలోదకాలిచ్చినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మంత్రి వ్యాఖ్యల ప్రకారం బోనస్ లేదంటే, రైతుబంధు ఏదో ఒకటి మాత్రమే అందించాలని నిర్ణయించుకున్నట్టు ఉందని రైతులు భావిస్తున్నారు. కేవలం సన్నవడ్లు పండించే రైతులకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ అందివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అదికూడా అరకొరగానే అమలు చేస్తున్నది. ఇప్పుడు ఆ బోనస్‌తోనే సరిపెట్టాలని చూస్తున్నట్టు ఉందని రైతులు కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా రైతుల నుంచి వడ్లు పూర్తిస్థాయిలో కొనడం లేదు. దళారులు కొంటే రైతులకు బోనస్ అందదు. కాబట్టి రైతులు.. రైతుబంధు, బోనస్ రెండూ కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 వానాకాలం పంట సమయంలో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఎకరానికి పంటకు రూ.4000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8వేల చొప్పున చెల్లించింది. 2018-19 వానాకాలంలో 50.25లక్షల మంది రైతులకు 5236.29కోట్లను అందజేసింది. ఆ తర్వాత పంటకు రూ.5వేలకు ప్రభుత్వం పెంచింది. అలా మొత్తంగా నిరుడు వానాకాలం వరకు 72817.04కోట్లను రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేసింది.
నిరుడు యాసంగి సీజన్‌కు కూడా రైతుబంధును విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతినివ్వలేదు. ఆ తర్వాత అనుమతిచ్చినా వరుసగా బ్యాంకు సెలవులు రావడంతో విడుదల సాధ్యంకాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరిట రూ.15వేలు ఇస్తామని ఆ పార్టీ నేతలు ప్రచారంలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15వేల సంగతి దేవుడెరుగు కేసీఆర్ సర్కారు ఇచ్చిన 10వేలకు కూడా రైతులు నోచుకోవడం లేదు. వానాకాలం సీజన్లో రైతు భరోసా సాయం అందిస్తామని నమ్మబలికింది. రైతుభరోసాపై అధ్యయనం కోసం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జిల్లాలో పర్యటిస్తూ హడావుడి చేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలవుతున్నా కూడా ఇప్పటివరకు రైతుభరోసాపై అతీగతి లేకుండా పోయింది. తాజాగా మంత్రి తుమ్మల బోనసా? రైతుబంధా? రైతులు ఏదిచెబితే అదే ఇస్తామంటూ మాట్లాడటం చూస్తే రైతుబంధు అటకెక్కినట్టే అని స్పష్టమవుతున్నది.