హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రుణమాఫీలో రైతుల జాబితా మొత్తం తప్పుల తడకగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘కనీసం రైతుల జాబితా కూడా సరిగ్గా చేయలేరా? ఎందుకీ తప్పులు జరిగాయి?’ అంటూ టెస్కాబ్ సీజీఎం జ్యోతిని నిలదీసినట్టు సమాచారం. మంగళవారం ఆయన సచివాలయంలో రుణమాఫీపై టెస్కాబ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రుణమాఫీలో టెస్కాబ్ పూర్తిగా విఫలమైంది.. మీ వైఫల్యం వల్ల ప్రభుత్వం బద్నాం అవుతున్నది. రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నా.. టెస్కాబ్ తప్పిదాల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. రుణమాఫీ సమస్యల్లో మెజార్టీ టెస్కాబ్ అనుబంధ బ్యాంకులవే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పులన్నీ సరిచేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.
రుణమాఫీలో తప్పుడు లెక్కలు సమర్పించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 16 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో 13 మంది కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు సహకార శాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన 16 సంఘాల కార్యదర్శులు తప్పుడు లెక్కలు సమర్పించినట్టు, రుణాలు తీసుకోకపోయినా, రుణమాఫీ గడువులో రుణం లేని వాటిని కూడా జాబితాలో పొందుపరిచినట్టు గుర్తించారు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు. మరో 105 మంది కార్యదర్శులు అసలు, వడ్డీల లెక్కలు తప్పుగా పంపించినట్టు గుర్తించి వారిని వివరణ కోరారు. రుణమాఫీలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.