హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరో ఏడుగురు అధికారుల బృందం విదేశీ పర్యటన ఖరారైంది. నెదర్లాండ్స్, పారిస్‌ల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 10నుంచి 15వరకు ఆరురోజుల పాటు ఈ బృందం ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నది. నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డామ్‌లో నిర్వహించే గ్రీన్ టెక్-2025 సదస్సులో పాల్గొనున్నది.
ఆ తర్వాత పారిస్‌లోని రంగీస్ ఇంటర్నేషనల్ మార్కెట్‌ను సందర్శించనున్నది. ఈ బృందంలో మంత్రి తుమ్మలతోపాటు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్, ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాష్మిన్ భాషా, మంత్రి ఓఎస్డీ శ్రీధర్, మార్కెటింగ్‌శాఖ సూపరింటెండెంట్ అరుణ్‌బాబు, ఉద్యానశాఖ అధికారి అర్చన, వ్యవసాయశాఖ అధికారి విశ్వనాథ్ ఉన్నారు. అయితే మంత్రితోపాటు అధికారుల బృందం రెండు దేశాల పర్యటనపై వ్యవసాయశాఖ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ రెండు దేశాలకు వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యవసాయరంగానికి, రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అని నిలదీస్తున్నారు. చిన్నచిన్న ఉద్యోగులకు బకాయిలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు గానీ.. అధికారులను విదేశాలకు పంపించేందుకు నిధులున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వెళ్లినా ఇద్దరో ముగ్గురో వెళ్తారు గానీ, ఇలా ఎనిమిది మంది వెళ్లడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.