Rythu Bharosa | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): అనుకున్నంత పని అయింది.. రైతుల ఆందోళన నిజమైంది. అంతా ఊహించినట్టుగానే వానకాలం రైతుభరోసాకు కాంగ్రెస్ స ర్కారు ఎగనామం పెట్టింది. పెట్టుబడి సాయం పై చేతులెత్తేసి రైతులకు ‘మొండి చేయి’ చూపింది. పెట్టుబడి సాయం కోసం కండ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన రైతుల నెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పిడుగు వేశారు.
వానకాలం పంట సీజన్ పూర్తయ్యాక చావు కబురు చల్లాగా చెప్పేశారు. ఈ సీజన్‌కు రైతుభరోసా ఇవ్వడం లేదని సాక్షా త్తు ఆయనే వెల్లడించారు. యాసంగి రైతుభరోసాపైనా నమ్మకం పెట్టుకోవద్దని పరోక్షంగా సంకేతాలిచ్చారు. యాసంగిలో రైతులందరికీ రైతుబంధు రాదని, పంట వేసిన రైతులకు, పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుభరోసాను ఎగవేసేందుకు పక్కా ప్లాన్‌తోనే ప్రభు త్వం మంత్రుల కమిటీ, సమావేశాలు, అభిప్రాయ సేకరణలు, అసెంబ్లీ చర్చ అని మభ్యపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పదివేలకూ ఎగనామం
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ. 10వేల చొ ప్పున పెట్టుబడి సాయం అందించింది. ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘ఈ 10వేలు ఎందుకు, నాలుగు రోజులు ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది. అప్పుడు రైతుభరోసా కింద అదనంగా రూ. 5వేలు కలిపి ఎకరాకు రూ. 15వేలు ఇస్తం’ అంటూ గప్పాలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి యాసంగి, ఈ వానకాలం సీజన్లు పూర్తయ్యాయి. ఇందు లో యాసంగిలో రైతుబంధు కింద పాత 10వే లే పంపిణీ చేసింది. ఈ సీజన్‌కైనా రూ. 15వేలు ఇస్తారేమో అని రైతులు ఆశపడ్డారు. కానీ పాత 10వేలకే ఎసరు పెట్టడం గమనార్హం.
కమిటీలతో కాలయాపన
రైతుభరోసాను అమలు తప్పించుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక వేసింది. రైతుబంధులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాలో మార్పుల కోసం మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 2వ తేదీన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. ఈ కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరించి 15 రోజుల్లో నివేదిక అందిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ పెడతామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల వారీగా తొమ్మిది సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి, నాలుగు సమావేశాలకే మమ అనిపించేసింది.
అసెంబ్లీలో చర్చే లేదు
రైతుభరోసాపై మంత్రుల కమిటీ 15 రోజుల్లో ఇస్తారన్న నివేదిక అతీ గతీ లేకుండా పోయింది. నాలుగు నెలలు గడుస్తున్నా నివేదికపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. తాజాగా మంత్రి తుమ్మల కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పకుండా.. కమిటీ నివేదిక రాగానే యాసంగి రైతుభరోసా ఇస్తామని ప్రకటించారు. యాసంగి సీజన్ ముగిసే వరకైనా నివేదక వస్తుందా లేక వానకాలం మాదిరిగానే ఎగనామం పెడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పిన ప్రభుత్వం.. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
యాసంగిలో కోతలకు సిద్ధం
యాసంగిలో పంట వేసిన రైతులకు, పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కుండబద్దలు కొట్టారు. రుణమాఫీ మాదిరిగానే రైతుభరోసాకూ పీఎం కిసాన్ నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే 5 ఎకరాలు లేదా 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలని భావిస్తున్నది.
కేసీఆర్ పెట్టుబడి సాయం 73వేల కోట్లు
రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా పాలన సాగించిన కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాల అమలులో ఏనాడు వెనకంజ వేయలేదు. రైతుబంధు పెట్టుబడి సా యం కింద ఐదున్నరేండ్లలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ. 73వేల కోట్లను జమ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కింది. కరోనా వంటి కష్టకాలంలోనూ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీలో ఆలస్యం చేయలేదు.