హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): వరికి ఆరుతడి పద్ధతిలో నీళ్లందించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. దీని వల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. స్వల్పకాలిక వరి రకాలను నవంబర్లో సాగు చేస్తే మార్చి మొదటి వారానికి కోతకు వస్తాయని తెలిపారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలోని గోదాములు వంద శాతం వినియోగంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కందులు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు మొదలైన పంటల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.