ఖమ్మం, జనవరి 5: ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సదుద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన(Prajapalana) కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. ఖమ్మం నగరంలోని 54వ డివిజన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందన్నారు.
ఇప్పటివరకు దరఖాస్తులు ఇవ్వని వారు చివరి రోజు కూడా గ్రామాల్లోనైతే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో అయితే వార్డు కార్యాలయాల్లో అధికారులకు అందజేయవచ్చన్నారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మిగతా పథకాల లబ్ధి కోసం ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఇంటికే పథకాలు నడచివస్తాయని భరోసానిచ్చారు. అనంతరం పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మంజుల, కమర్తపు మురళి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.