హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతతో బీజేపీ చెలగా టమడుతున్నదని, దీనిని సహించబోమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. యువత ఉద్యోగాలు చేయవద్దని, ఆరు నెలలు బీజేపీ కోసం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. వరుస ఉద్యోగ నోటిఫికేషన్లతో తమకు యువ త దూరమవుతున్నదని బీజేపీ పన్నిన కుట్ర లో భాగమే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారమని ఆరోపించారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ మా దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని చెప్పారు.
దేశంలోనే టీఎస్పీఎస్సీకి మంచి ట్రాక్ రికార్డు ఉన్నదని, ఇక్కడి విధానాలను అనేక రాష్ర్టాలు, చివరికి యూపీఎస్సీ కూడా అనుసరించిన ఉ దంతాలు ఉన్నాయని అన్నారు. దురదృష్టవశాత్తు ఉద్యోగాల భర్తీని జీర్ణించుకోలేని బీజేపీ పేపర్ లీకేజీకి కుట్ర పన్నిందని ఆరోపించారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్ ఈ పేపర్ లీకేజీలో ఏ2 నిందితుడిగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. పేప ర్ లీకేజీ కేసులో ఎంతటివాళ్లున్నా సరే విడిచిపెట్టేది లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఈ లీకేజీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే సిట్ వేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ దురుద్దేశంతో రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. స్కాంలు చేయటం, పేపర్లు లీకులు చేయటమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీలో జరిగిన స్కాంలను ఆయన ఏకరువు పెట్టారు. ఉద్యోగార్థులపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు.