హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన జెక్ కాలనీలో పర్యటించారు. మొదట జెక్ కాలనీ వాసులు తమ అవసరాల కోసం లీజుపై ఇవ్వాలని కోరుతున్న వక్ఫ్ బోర్డ్‌కు చెందిన స్థలాన్ని.. వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసి ఉల్లాఖాన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం జెక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ అమయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిశోర్‌తో పాటు వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సుమారు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో కాలనీ ప్రజలు పూర్తిస్థాయిలో పాల్గొని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ప్రతి ఆదివారం ఎర్రగడ్డ సంత నిర్వహణ లో భాగంగా జెక్ కాలనీలో కూడా ఇష్టానుసారంగా దుఖాణాలు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కాలనీ ప్రజల అవసరాల కోసం స్థలాన్ని కేటాయించాలని, అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజి తదితర పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాలనీలోని అన్ని సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రకటించారు.

ఎర్రగడ్డ సంతతో కలుగుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించగా.. చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు సంతను సందర్శించి.. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపావళి పండుగ తర్వాత సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
కాలనీ ప్రజల అవసరాల కోసం వక్ఫ్ బోర్డ్‌కు చెందిన స్థలాన్ని వీలైనంత త్వరగా లీజుపై కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో ఉన్న పార్క్‌ను నెలరోజుల్లో అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పని చేస్తున్నామన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో రూ.1600కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.