మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 04:52:03

బీసీలకు మరో పూలే కేసీఆర్‌

బీసీలకు మరో పూలే కేసీఆర్‌
  • సంపద సృష్టి, పేదవర్గాలకు
  • పంపకమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
  • మాంద్యంలోనూ ప్రగతిశీల బడ్జెట్‌
  • టీఆర్‌ఎస్‌ బీసీ అనుకూల విధానంవల్లే బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌
  • బీసీల తరఫున ముఖ్యమంత్రికేసీఆర్‌కు ధన్యవాదాలు
  • మంత్రులు తలసాని శ్రీనివాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బీసీలకు సీఎం కేసీఆర్‌ మరో జ్యోతిబా పూలే అని, సంపద సృష్టించాలి, పేదవర్గాలకు పంచాలనేదే ఆయన లక్ష్యమని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. బీసీలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులతో ఆ వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు నిధులు కేటాయించారని, బడ్జెట్‌లో బలహీనవర్గాలకు పెద్దపీట వేసినందుకు బీసీవర్గాల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఆర్థికమాంద్యంలోనూ బ్రహ్మాండమైన ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఎంబీసీలకు రూ.500 కోట్లు కేటాయించారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి సహా ఇతర పథకాలకు పెద్దఎత్తున నిధులు ప్రకటించారని చెప్పారు. రాజకీయంగా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అని పేర్కొన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ను నిర్మిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నేతలు బయటికి వెళ్లి మాట్లాడం కంటే అసెంబ్లీ లోపలే ఉండి చర్చించవచ్చని సూచించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకోవాలని హితవుపలికారు.


బిత్తరపోయిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు 

బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు చూసి కాంగ్రెస్‌, బీజేపీ నేతలు బిత్తరపోతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఇన్నేం డ్ల బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనలో కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేయలేకపోయాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బడ్జెట్‌లో రూ.30వేల కోట్ల వరకు కేటాయించారని చెప్పారు. బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీ అనుకూల విధానాల వల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ కొనసాగుతున్నారని తెలిపారు. ప్రధానిగా బీసీ ఉండి కూడా ఏమీచేయడంలేదని పేర్కొన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ కంటే ఎక్కువగా నిధులు కేటాయించారని గుర్తుచేశారు. సబ్‌ప్లాన్‌ ఉంటే ఎంబీసీలకు కేటాయించిన రూ.500కోట్లలో ఐదుశాతం కూడా రావన్నా రు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. బీసీలకు ఈ బడ్జెట్‌లో ప్రత్యక్షంగా రూ.4,356 కోట్లు, ఎంబీసీలకు రూ.500 కోట్లు కేటాయించామని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి బడ్జెట్‌లో బీసీలకు కేటాయించింది కేవలం రూ. 2,900కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మికి అదనంగా రూ.650 కోట్లు కేటాయించామని, దీనిద్వారా 70వేల మందికి అదనంగా లబ్ధిచేకూరుతుందని చెప్పారు. గీత కార్మికులకు రూ.25 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.


సీఎం కేసీఆర్‌కు గౌడసంఘం కృతజ్ఞతలు 

వెనుకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించి వెన్నుదన్నుగా నిలిచారని మోకు దెబ్బ నేతలు ప్రశంసించారు. మోకు దెబ్బ అధ్యక్షుడు అమరవేని నర్సాగౌడ్‌, సంఘం కార్యవర్గ సభ్యులు రాఘవుల సిద్ధిరాములుగౌడ్‌, శ్రీపతి లింగాగౌడ్‌, కేసరి ఆంజనేయులుగౌడ్‌, సత్యగౌడ్‌, మాదగోని పద్మ బాలరాజుగౌడ్‌ తదితరులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.


logo
>>>>>>