Sri Rama Navami | రామయ్య పెళ్లికి.. పాటల పల్లకి
ఎంత చక్కని రాముడో.. అంత చక్కని సీత! త్రేతాయుగం నాటి జంట. యుగాలు దాటినా అదే కన్నులపంట. వీరి కల్యాణానికి సుముహూర్తం సమీపిస్తున్నది. ఏటా జరిగే ఉత్సవమే అయినా.. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి..’ పాట చెవిన పడగానే నవమి ఘడియలు ప్రారంభమవుతాయి.
Sri Rama Navami | ఎంత చక్కని రాముడో.. అంత చక్కని సీత! త్రేతాయుగం నాటి జంట. యుగాలు దాటినా అదే కన్నులపంట. వీరి కల్యాణానికి సుముహూర్తం సమీపిస్తున్నది. ఏటా జరిగే ఉత్సవమే అయినా.. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి..’ పాట చెవిన పడగానే నవమి ఘడియలు ప్రారంభమవుతాయి. జానకి తోడుగా కదిలే కల్యాణరాముణ్ని ఊరేగించడానికి సినీకవుల పాటల పల్లకి సదా సిద్ధంగా ఉంటుంది! ఈ శుభ సమయంలో ఆ అపురూప గీతాలను స్మరించుకుంటే పుణ్యానికి పుణ్యం.. ఆనందానికి ఆనందం.
రాముడి పాటలు తలుచుకుంటే గుర్తొచ్చేది దేవులపల్లి వారే! గుహుడి గుండె వేదన, శబరి హృదయ నివేదన ఆయన కలం నుంచి జాలువారితే.. అది రామాయణమంత నిండుగా ఉంటుంది. ‘ఈ గంగకెంత దిగులు.. ఈ గాలికెంత గుబులు.. కదలదయా రామా!’ అని ఆ సందర్భాన్ని వర్ణించిన తీరు గంగనీటి కన్నా పవిత్రంగా అనిపిస్తుంది. సంపూర్ణ రామాయణంలో ఆయన రచించిన ‘అసలే ఆనదు చూపు.. ఆపై ఈ కన్నీరు.. తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో!’ అని శబరి గుండె బరువును తేలికైన పదాలలో వర్ణించిన దేవులపల్లికి రామానుగ్రహం ఎంత ఉండి ఉంటుందో!!
‘రామా కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా…’ స్వాతిముత్యంలో హీరో ఎత్తుకున్న పాట. మన సినారె రాసిన పాట. హరికథ పంథాలో సాగిపోయే ఈ గీతం మార్మోగకుండా ఏ ఊళ్లో రాములవారి పెండ్లితంతు పూర్తవ్వదు. సీతా స్వయంవరం నుంచి జానకిరాముల కల్యాణ ఘట్టం వరకు రామబాణమంత వేగంగా సాగిపోతుందీ పాట. ‘కనగ కనగ కమనీయమే.. అనగ అనగ రమణీయమే..’ అని సీతారాముల కల్యాణ వైభోగాన్ని చాటి చెప్పారు నారాయణరెడ్డి. ఈ కవిని తలుచుకుంటే ‘స్వయంకృషి’ సినిమాలో మరో సీతారాముల పాట తలపులోకి రాకుండా ఉంటుందా? ‘రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా’ అంటూ భూజాతను చూసినప్పుడు ఆ రాజీవలోచనుడి మదిలో మెదిలిన భావాన్ని సిత్రంగా వర్ణించారు.
రామాయణాన్ని కాచివడబోసిన ఎందరో సినీ కవులు సినిమాల్లో సరైన సందర్భం తారసపడితే చాలు.. రాముని వైభవాన్ని తమ రచనా వైచిత్రితో సుమనోహరంగా వర్ణించారు. ‘భూకైలాస్’ సినిమాలో సముద్రాల రాఘవాచార్య రాసిన ‘రాముని అవతారం.. రవికుల సోముని అవతారం..’ గీతం వినిపించని రామకల్యాణ మహోత్సవం ఉండదు. నారదముని వాల్మీకి మహర్షికి ఉపదేశించిన సంక్షిప్త రామాయణమంతా క్లుప్తంగా ఈ పాటలో వివరించారు సీనియర్ సముద్రాల. ‘లవకుశ’లో రామాయణాన్నంతా ‘వినుడు వినుడు రామాయణ గాథ.. ’ అని ఆయన అందించిన గీతాలు మనసారా వినడం నవమి ప్రత్యేకతల్లో ఒకటి. సీతారాములు జట్టుకట్టే అభిజిత్ లగ్నం వరకు ఎన్నిపాటలు వినిపించినా.. తాళికట్టు శుభవేళ ఊరంతా మార్మోగే పాట ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి..’ రాసిందీ సముద్రాల వారే.
ఇందులో ‘జానకి దోసిట కెంపుల ప్రోవై, రాముని దోసిట నీలపు రాశై’ అని ఆయన చేసిన ప్రయోగం నవదంపతుల రూపురేఖలను చాటి చెబుతుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో ‘సీతారాముల కల్యాణం.. చూసిన వారిదే వైభోగం’ అని సాగే పెండ్లిపాట విన ముచ్చటగా ఉంటుంది.
కోదండరాముడి గుణగణాలను చాటిచెప్పే పాటలు తెలుగు సినిమాల్లో కొల్లలు. ఆనాటి ‘శాంతినివాసం’ మొదలుకొని నిన్నమొన్నటి ‘ఆదిపురుష్’ వరకు ఎన్నో సినిమాల్లో రసరమ్య గీతాలు రమ్యమైన రామనామ మహిమను చాటిచెప్పాయి. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో ‘అందాల రాముడు.. ఇందీవర శ్యాముడు.. ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు..’ అని ప్రశ్నతో పాట మొదలుపెట్టిన ఆరుద్ర… ‘తండ్రిమాటకై పదవుల త్యాగమే జేసెను.. తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను.. అందువలన దేవుడు’ అని పట్టాభిరాముడి గుణగణాలను పాటలో వివరించాడు. ‘జగదభిరామ రవికుల సోమ శరణము నీయవయా.. రామా.. కరుణను జూపవయా’ అంటూ సాగే ‘రామాలయం’ సినిమా పాట దాశరథి వైభవాన్ని తెలుపుతుంది. ఇక తెలుగునాట విశేష ఆదరణ పొందిన ‘రామాంజనేయ యుద్ధం’ సినిమా అంతగా ఆడకపోయినా.. అందులో ఈలపాటి రఘురామయ్య ఆలపించిన ‘రామనీల మేఘశ్యామ కోదండరామ.. ’ ఆహ్లాదకరంగా సాగుతుంది.
‘జగదానంద కారకా.. జయ జానకీ ప్రాణ నాయకా..’ అని ‘శ్రీరామరాజ్యం’లో జొన్నవిత్తుల పాట నవమి నాడు ప్రతి మంటపంలో పదేసిసార్లు వినిపిస్తుందంటే అతిశయోక్తికాదు. ‘దేవుళ్లు’ కోసం ‘అందరి బంధువయా.. భద్రాచల రామయ్య.. ’ అని భద్రగిరి రాముడి వైభవాన్నీ చాటిచెప్పింది ఆయనే! ఇలా చెబుతూపోతే.. ‘శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుప్రీతి..’ పాటలా, రాములోరి పాటల పల్లకీ ఆగేదా! కొసరాజు వారి కొసమెరుపుతో ముగిద్దాం!
‘రామయ తండ్రి.. ఓ రామయ తండ్రి మా నోములన్ని పండినాయి రామయ తండ్రి..’ మేర లేని గుహుడి ఆనందానికి గుడికట్టిన పాట ఇది. ‘అందరినీ దరి చేర్చే మారాజువే… అద్దరినీ చేర్చమనీ అడుగుతుండావే.. నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి.. నను దయ చూడగ వచ్చావు రామయ తండ్రి..’ అన్నట్టు కల్యాణ రాముడి దయ మనపై సదా ఉండుగాక!
– కీర్తన
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

