నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.
ఫ్లోడైడ్ సమస్యను పరిష్కరించాలని కోరితే నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడిందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం మాత్రమే వచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను మరిచి, కాంట్రాక్టులపైనే శ్రద్ధ పెట్టారని విమర్శించారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.