హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణపై ఎంత కక్ష ఉన్నదో పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ప్రశ్నించకపోయినప్పటికీ, ఆంధప్రదేశ్ విభజన అంశాన్ని లేవనెత్తిన ప్రధాని పొలిటికల్ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. మంగళవారం తలసాని శ్రీనివాస్‌యాదవ్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాట్లాడుతూ.. ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం డ్రామాలు స్టార్ట్ చేశారని దెప్పిపొడిచారు. తెలంగాణకు కాంగ్రె స్ అన్యాయం చేస్తే ప్రధాని మోదీ ఏం న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రధాని హోదాలో ఉండి రాష్ట్ర విభజనపై బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే, ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మోదీ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపిందని మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణి వంటి సంస్థలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి జోలికి వస్తే మళ్లీ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. ఏడున్నరేండ్లుగా ప్రధాని మోదీ రాష్ర్టానికి అన్యాయం చేస్తూనే ఉన్నారని, తరచూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిగా బాధ్యతగా వ్యవహరించాలని హితవు చెప్పారు.