హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి వెల్లడించారు.
సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. మంటల ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోయింది.
ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు సజీవదహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, చింటు, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్‌గా గుర్తించామన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉన్నాయని పోలీసులు చెప్పారు. టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు మంటలు వ్యాపించాయన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి ఇబ్బందయిందని తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.