వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని మత్స్యశాఖ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాలతో కలిసి అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 26,778 నీటి వనరుల్లో రూ. 88.53 కోట్ల వ్యయంతో 68 కోట్ల చేప పిల్లలు, 24.50 కోట్ల రూపాయల వ్యయంతో 275 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు చేప, రొయ్య పిల్లల సరఫరాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాటిని తిరస్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు తిరస్కరించేందుకు గల కారణాలను కూడా కమిషనర్ కార్యాలయానికి నివేదించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చేప పిల్లల విడుదల సమయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఒకరోజు ముందే సంబంధిత సొసైటీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు.
చేప పిల్లల విడుదల ప్రక్రియను తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. ఉదయం 9 గంటలలోపే చేప పిల్లల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విడుదల ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబధిత మత్స్యకారుల కు విడుదల చేసిన చేప పిల్లల సంఖ్య, రకాలను వివరించాలని, ప్రత్యేక ధృవీకరణ పత్రంలో వివరాలను నమోదు చేసే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు కార్యాలయలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి, తగు ఆదేశాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రతిరోజూ ఎన్ని చేప, రొయ్య పిల్లలను ఎన్ని నీటి వనరుల్లో విడుదల చేశారో ఆ వివరాలను టీ మత్స్య పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. చేప పిల్లల లెక్కింపు లో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా, సమయం వృథా కాకుండా ఉండేందుకు అవసరమైన మేరకు మిషన్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. ఏ చెరువులో ఎంత నీరుందో పర్యవేక్షించేందుకు ఇప్పటి వరకు 26 వేల నీటి వనరులను జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. దీనివల్ల 2016-17 నుంచి ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, మత్స్యకారుల ఉపాధి అవకాశాలు కూడా ఎంతో మెరుగయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.