హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. గురువారం బంజారాహిల్స్ లోని బంజార భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని BC కులవృత్తి దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లతో కలిసి 300 మంది లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని చెప్పారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా నిలవాలి. వారి అభివృద్ధికి చేయూతను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందనిపేర్కొన్నారు.
నగరంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, వాటర్ సమస్యల పరిష్కారం, పార్క్ ల అభివృద్ధి, గ్రేవ్ యార్డ్ ల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్న స్థలాన్ని GO 58 తీసుకొచ్చి వారికే సొంతం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలి. వారు గొప్పగా బతకాలనే లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈప్రాంత ప్రజా ఓట్లతో గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న, కార్పొరేటర్ వనం సంగీత,ఆర్డీవో రవి, బీసీ కార్పోరేషన్ జిల్లా అధికారి ఆశన్న, ప్రత్యేక అధికారి చరితారెడ్డి పాల్గొన్నారు.