హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గృహలక్ష్మి పథకం అమలు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేకపోతున్న పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించే విధంగా గృహలక్ష్మి అనే గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు వివరించారు.
గృహలక్ష్మి పథకం నిరంతర కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ పథకంతో వేలాది మందికి మేలు జరుగుతుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారిని గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా పేద ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. నగరంలో ఇండ్లు నిర్మించుకొనేందుకు ఖాళీ స్థలాలు లేవని, ప్రస్తుతం ఉన్న ఇంటిపైనే మరో నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పలువురు MLA, MLC లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని వివరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, రహ్మత్ బేగ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, కౌసర్ మోయినోద్దిన్, బలాల, మోజం ఖాన్, ముంతాజ్ ఖాన్, GHMC అదనపు కమిషనర్ స్నేహ శబరీష్, పీడీ సౌజన్య పాల్గొన్నారు.