సిద్దిపేట : దేశం అబ్బుర పడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండ పోచమ్మ రిజర్వాయర్లో ఉచిత చేప, రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యరంగం నిర్లక్ష్యం చేయబడింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి నేడు ఒక్క అవకాశం ఇవ్వమనడం వారి దివాళాకోరు తనానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే కండ్లు ఉండి కూడా చూడలేకపోతున్న కబోదులు అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలతో సాగులో అద్భుతమైన ప్రగతిని సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, వైస్ చైర్మన్ మల్లయ్య పాల్గొన్నారు.