హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. బుధవారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధి ఉప్పుగూడలోని మహంకాళి ఆలయం పక్కన రూ. 4.96 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Chief Minister KCR) పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటిలో జరిగే చిన్న, చిన్న వేడుకల నిర్వహణకు పేద, మధ్యతరగతి ప్రజలు ఫంక్షన్ హాళ్లకు లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీ+3 లో మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్((Multi purpose Function Halls) నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఒక సంవత్సరం లోగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఈ మల్టి పర్పస్ హాళ్లను అతి తక్కువ అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు, బతుకమ్మ(Bathukamma) ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల( Bonalu) ఉత్సవాలను గొప్పగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రయివేట్ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అన్నారు.
లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ. 10 కోట్లను విడుదల చేశారని, ఆలయ పరిధిలో అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ (MLC) ఎంఎస్ ప్రభాకర్ రావు, కార్పొరేటర్లు అబ్దుల్ సమీద్, సలీం బేగ్, మహంకాళి ఆలయ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.