హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సర్కిల్, ప్యాట్నీ సర్కిల్, ప్యారడైజ్ సర్కిల్, బోట్స్ క్లబ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు.
శోభాయాత్ర నిర్వహించే మార్గాలలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా విగ్రహాలతో వచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు అడ్డం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల కోసం వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలకు స్వాగతం పలికే విధంగా స్టేజీలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ మధుసూదన్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, ఆర్ అండ్‌బీ ఈఈ రవీంద్ర మోహన్, జీహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, శీలం ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.