హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Chief Minister KCR) నాయకత్వంలో దేవాలయాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన పాలక మండలి చైర్మన్ సత్యనారాయణ, ఇతర సభ్యులకు మంత్రి శాలువాలు కప్పి శుభాభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు (Devotees Facilities) ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కార్యక్రమానికి కోట్లాది రూపాయలను అందిస్తున్నదని చెప్పారు.
దేవాదాయ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది, అర్చకుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేశారు. చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి(Yadadri) దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గొప్పగా నిర్మించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే (MLA )సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, నాయకులు నాగులు తదితరులు పాల్గొన్నారు.