హైదరాబాద్ : దేశం, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్(BRS), సీఎం కేసీఆర్(CM KCR)తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలో బోయిన్ పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్(BRS) పార్టీ ఆత్మీయ సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా దివంగత ఎమ్మెల్యే (MLA) సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కంటోన్ మెంట్(Cantonment) ప్రజా సమస్యలు అనేకం పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో కంటోన్ మెంట్ వాసులకు 15 రోజులకోసారి తాగునీరు సరఫరా జరిగేదని గుర్తు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Minister KTR) చొరవతో జీహెచ్ఎంసీ(GHMC )లో మాదిరిగానే కంటోన్ మెంట్ లో కూడా ప్రతిరోజు తాగునీటి సరఫరా అందుతుందని వెల్లడించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను , మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు.
కంటోన్ మెంట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) చేతుల మీదుగా రూ. 1200 కోట్ల వ్యయంతో మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. రాబోయే ఎన్నికల్లో కంటోన్ మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మరో 95 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసిందని వివరించారు.
కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్(Congress) పార్టీల నాయకుల వలన ప్రజలకు ఏం మేలు జరగదని స్పష్టం చేశారు. ఈ నెల 25న అన్ని నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్(BRS )జనరల్ బాడీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి శ్రవణ్, నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ పాల్గొన్నారు.