హైదరాబాద్ : హైదరాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ భోనాలు(Ashada Bonalu) జూన్ 22 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) వెల్లడించారు. శుక్రవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ జూన్ 22 న గోల్కొండ లో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని, జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10 రంగం, 16 న ఓల్డ్ సిటీ బోనాలు, 17 న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు జరుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రకటించారని గుర్తు చేశారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించిందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) మల్లారెడ్డి(Minister Mallareddy), సీఎస్ శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ (DGP) అంజనీ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.