Minister Srinivas Yadav | ఉమ్మడి పాలనలో సరైన సౌకర్యాలు లేక, సిబ్బంది లేక ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితులు ఉండేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. నేడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా దవాఖానాలను తీర్చిదిద్దిందని.. అన్ని రకాల పరీక్షలు, ఆపరేషన్లు చేస్తుండడంతో ‘నేను పోత సర్కారు దవాఖానకు’ అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. ఇదే తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగాన్ని అభివృద్ధి చేసిందని చెప్పేందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం వైద్య దినోత్సవాన్ని సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు మంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైదారోగ్యశాఖలో డాక్టర్లు, ఆశావర్కర్లు, నర్సులు, ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత వేతనాలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే.. నేడు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గతంలో ఎంబీబీఎస్ పీజీ చేయాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
గతంలో ఉన్న 850 ఎంబీబీఎస్ సీట్లను ప్రస్తుతం 2815కి పెంచుకున్నామని.. పీజీ సీట్లు 1216 పెరిగాయన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలతో సర్కారు ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని, ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోట్లాది వ్యయంతో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, క్యాత్ ల్యాబ్ తదితర అత్యాధునిక పరికాలు అందుబాటులోకి తీసుకువచ్చి వేల విలువైన సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.
అల్వాల్, ఎర్రగడ్డ, కొత్తపేట ప్రాంతాల్లో నూతనంగా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. నిమ్స్‌ను మరింత విస్తున్నట్లు చెప్పారు. పేదల చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో పేదలు అధికంగా నివసించే బస్తీల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకట్, గాంధీ హాస్పిటల్ ఆర్ఎంఓ జయకృష్ణ, ఎస్పీహెచ్ఓలు రాజశ్రీ, అనురాధ, సునంద, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత తదితరులు పాల్గొన్నారు.