వనపర్తి : మత్స్య సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి శనివారం మంత్రి పెబ్బేరు పట్టణంలోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, మత్స్య కళాశాల బాలికల వసతిగృహాన్ని, చేపల చెరువు, సీసీరోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మత్స్య సంపదను పెంచేందుకు కృషి చేశారన్నారు. రూ.4.55కోట్లతో మత్స్య కళాశాలను ప్రారంభించామని, రూ.1.20కోట్లతో సీసీరోడ్లు, రూ.30లక్షలతో చేపల చెరువులను ఏర్పాటు చేసినట్లు సూచించారు.
మత్స్య సంపదతో రాష్ట్రంలోని 30 లక్షల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని, 23వేల చెరువులను జియో ట్యాగింగ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 2018లో ప్రారంభించిన మత్స్య కారులకు చేపల పెంపకం కార్యక్రమం నేడు గ్రామ గ్రామాన విస్తరించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తు నీరు ఉన్న ప్రతి చెరువులో చేప పిల్లలు వదిలి వాటిని మత్స్యకారులకు అప్పగించి, జీవన ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని వేలాది చెరువుల పూడికతీత కట్టుదిట్టం చేసి నీటి నిల్వలు పెంచడంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో మత్స్యకారులు అభివృద్ధి సాధించాలని ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పెబ్బేరులో మత్స్య కళాశాల దేశానికి ఆదర్శవంతం అయ్యేలా తీర్చిదిద్దుతామన్నారు. 40 ఎకరాల్లో యూనివర్సిటీలో పీజీ, రీసెర్చ్ స్థాయిలను ఏర్పాటు చేయడంతో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా చదువుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
నేడు టన్నుల కొద్ది చేపలను ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఇది మనకు గర్వకారణమన్నారు. మత్స్య కళాశాలను అంతర్జాతీయ కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతయ మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉందని, ఆ కోవలో మత్స్యకారులకు ఆర్థికాభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే మత్స్య సంపదలో ప్రథమ స్థానంలో ఉందని ఆయన వివరించారు. మత్స్య కళాశాల ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు.
26వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జరిగిందని, మత్స్య కళాశాలలో మొదటి బ్యాచ్‌లో 12 మంది విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు రావడం జరిగిందని ఆయన సూచించారు. పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం చేపల కట్ లెట్ బ్రోచర్లను మంత్రులు విడుదల చేశారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జడ్పీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, మత్స్య కళాశాల ప్రిన్సిపల్, వైస్ చాన్సెలర్ రామచంద్ర, సిబ్బంది కిషన్ కుమార్, మత్స్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.