మహబూబ్నగర్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కొరముని నర్సింహులుతో కలిసి రామయ్యబౌలి, బీకే రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షానికి ఇండ్లు కోల్పోయిన వారికోసం బీకే రెడ్డి కాలనీలోని పసుల కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్, అల్మాస్ ఫంక్షన్ హాల్ రెండింటిని సిద్ధంగా ఉంచామని మంత్రి తెలిపారు. అత్యవసర వేళలో సంప్రదించేందుకు కంట్రోల్ రూమ్ నెంబర్ 08542241165, 08542 -252203 నెంబర్లలో సంప్రదించాలని మంత్రి సూచించారు.
24 గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలోని ఇతర అధికారులు కూడా అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వాగులు, బ్రిడ్జిల వద్ద కాపలా ఉంచాలని, ఎక్కడైనా గాలులకు చెట్లు విరిగి పడితే వెంటనే తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.